Wanindu Hasaranga: శ్రీలంకకు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో రెండో వన్డేకి స్టార్ ఆల్ రౌండర్ దూరం

Sri Lanka star all rounder Wanindu Hasaranga has been ruled out for second match


భారత్-శ్రీలంక జట్ల మధ్య ఇవాళ (ఆదివారం) రెండో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మ్యాచ్ షురూ కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ వనిందు హసరంగ గాయం కారణంగా దూరమయ్యాడు. తొలి వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో అతడు చేతి కండర గాయానికి గురయ్యాడని, సిరీస్‌లోని మిగతా అన్ని మ్యాచ్‌లకు దూరమవుతున్నాడని ఆ జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. వనిందు హసరంగ మొదటి వన్డేలో తన 10వ ఓవర్ చివరి బంతి సమయంలో ఎడమ చేతి కండరం నొప్పికి గురయ్యాడని, ఎంఆర్ఐ స్కానింగ్‌లో గాయం నిర్ధారణ అయిందని పేర్కొంది.

గాయపడి దూరమైన వనిందు హసరంగ స్థానంలో అనుభవజ్ఞుడైన స్పిన్నర్ జెఫ్రీ వాండర్సేను జట్టులోకి ఎంపిక చేసినట్టు జట్టు మేనేజ్‌మెంట్ పేర్కొంది. మొదటి వన్డేలో హసరంగ కీలక పాత్ర పోషించాడు. భారత లక్ష్య ఛేదనలో మూడు కీలకమైన వికెట్లు తీసి కష్టాల్లోకి నెట్టాడు. కాగా శ్రీలంక జట్టుని గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే స్టార్ ఫాస్ట్ బౌలర్లు మతీశా పతిరన, దిల్షాన్ మధుశంక గాయాల కారణంగా జట్టుకి దూరమయ్యారు. కాగా రెండవ వన్డేకి ముందు భారత ఆటగాళ్లు ఎవరికీ ఎలాంటి గాయాలు లేవు. అయితే జట్టులో ఒకటి లేదా రెండు మార్పులు ఉండొచ్చనే అంచనాలున్నాయి.

More Telugu News