Mallu Bhatti Vikramarka: త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తాం: ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క

Bhattivikramarka says will give new ration cards soon

  • అర్హత ఉన్నవారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని హామీ 
  • రైతు రుణమాఫీతో దేశ చరిత్రలోనే తెలంగాణ రికార్డ్ సృష్టించిందన్న డిప్యూటీ సీఎం
  • రెప్పపాటు సమయం కూడా కరెంట్ పోకుండా ఇవ్వాలనేది ప్రభుత్వం లక్ష్యమన్న భట్టివిక్రమార్క

త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రకటించారు. అర్హత ఉన్నవారందరికీ ఇస్తామని హామీ ఇచ్చారు. శనివారం నాడు ఖమ్మం జిల్లాలో పర్యటన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతు రుణమాఫీతో దేశ చరిత్రలోనే తెలంగాణ రికార్డ్ సృష్టించిందన్నారు. లక్ష్యానికి అనుగుణంగా అందరికీ మాఫీ చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో రూ.2 లక్షల లోపు రుణమాఫీ కూడా చేస్తామన్నారు.

తెలంగాణలో రెప్పపాటు సమయం కూడా కరెంట్ పోకుండా ఇవ్వాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. గతంలో ట్రిప్ అయితే కరెంట్ ఇచ్చేవాళ్లు కాదని... తమ ప్రభుత్వంలో అర్ధరాత్రి ఫిర్యాదు వచ్చినా వెళ్లి కరెంట్ ఇచ్చేవిధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రకృతి వైపరీత్యం, లైన్ మెయింటెనెన్స్ సమయంలో తప్ప కరెంట్ పోవడం లేదన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కరెంట్ పోయినా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ వాడకం పెరిగినప్పటికీ సమస్య లేకుండా ఇస్తున్నామన్నారు.

తెలంగాణలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. మధిర నియోజకవర్గంలో కొద్ది రోజుల్లోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అంగన్వాడీలో 3వ తరగతి వరకు ఏర్పాటు చేసి, నాలుగో తరగతికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలుకు పంపించే ఏర్పాటుకు నాంది పలికామన్నారు.

మధిర నియోజకవర్గంలోని మహిళలను పాడి పరిశ్రమలో వాటాదారులుగా చేసి వారిని పారిశ్రామికవేత్తలుగా చేయడానికి 2014కు ముందే ఇందిరమ్మ డెయిరీని ప్రవేశపెట్టామని తెలిపారు. నియోజకవర్గంలోని డ్వాక్రా మహిళలకు గేదెలు ఇచ్చి వారిని పరిశ్రమలో వాటాదారులుగా చేస్తామన్నారు. ఆర్థికమంత్రిగా అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టానని తెలిపారు.

  • Loading...

More Telugu News