Asia cup 2025: ఛాంపియన్స్ ట్రోఫీ కాకుండానే ఇండియా-పాకిస్థాన్ మధ్య వచ్చే ఏడాది 3 మ్యాచ్‌లకు ఛాన్స్!

as per the tentative format for next years Asia Cup again India and Pakistan are in same group

  • ఫార్మాట్ ప్రకారం ఆసియా కప్-2025లో ఒకే గ్రూపులో ఉన్న భారత్-పాకిస్థాన్
  • లీగ్ దశతో పాటు గ్రూప్-4, ఫైనల్‌లోనూ తలపడే అవకాశాలు
  • ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి బడ్జెట్ ఆమోదించిన ఐసీసీ

భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లు అంటే ఇరుదేశాల అభిమానులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడంతో ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్‌లలో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. అయితే వచ్చే ఏడాది ఐసీసీ నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో కాకుండానే భారత్-పాకిస్థాన్ మధ్య మరో ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియా కప్‌లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి.

2025లో టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఆసియా కప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ తాత్కాలిక ఫార్మాట్‌ ప్రకారం భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయని, టోర్నీలో సూపర్‌-4 దశలో రెండోసారి తలపడే అవకాశం లేకపోలేదని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) వర్గాలు పేర్కొన్నాయి. ఇరు జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తే మూడవ మ్యాచ్ కూడా జరిగే ఛాన్స్ ఉందని ఏసీసీ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా 2023 ఆసియా కప్‌ సమయంలో గందరగోళం నెలకొంది. ఆతిథ్య దేశం పాకిస్థాన్‌కు వెళ్లేందుకు భారత్ నిరాకరించడంతో ఈ జట్ల మధ్య మ్యాచ్‌లను చివరిలో అనూహ్యంగా శ్రీలంకకు మార్చాల్సి వచ్చింది. అయినప్పటికీ నష్టం జరగలేదని ఏసీసీ వర్గాలు చెప్పాయి. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఫలితంగానే ఈ లాభాలు పొందగలిగామని వెల్లడించాయి.

ఛాంపియన్స్ ట్రోఫీకి బడ్జెట్ ఆమోదం
కాగా వచ్చే ఏడాది ఆరంభంలో పాకిస్థాన్‌ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 జరగనుంది. ఈ టోర్నీ నిర్వహణకు సుమారు 70 మిలియన్ డాలర్ల బడ్జెట్‌ను ఐసీసీ ఆమోదించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఐసీసీ ఆర్థిక విభాగం సంయుక్తంగా రూపొందించిన బడ్జెట్‌ను బీసీసీఐ కార్యదర్శి జై షా నేతృత్వంలోని ఐసీసీ ఫైనాన్షియల్, కమర్షియల్ కమిటీ కమిటీ పరిశీలించి ఆమోద ముద్ర వేసిందని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. అదనపు బడ్జెట్‌గా 4.5 మిలియన్ డాలర్లు మాత్రమే కేటాయించారని సమాచారం.

  • Loading...

More Telugu News