BSF: బీఎస్ఎఫ్ చీఫ్, డిప్యూటీ చీఫ్‌లను తొలగించిన కేంద్ర ప్రభుత్వం

Central Government removed BSF Director General Nitin Agrawal and his deputy Special DG West YB Khurania

  • బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్‌‌పై వేటు
  • బీఎస్‌ఎ డిప్యూటీ స్పెషల్ డీజీ (పశ్చిమ) వైబీ ఖురానియా తొలగింపు
  • ఇద్దరినీ వారి రాష్ట్రాల కేడర్‌కు పంపించిన కేంద్రం
  • ఇటీవల సరిహద్దు వెంబడి చొరబాట్లు పెరిగిపోయిన నేపథ్యంలో బాధ్యుల్ని చేస్తూ నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) డైరెక్టర్ జనరల్ నితిన్ అగర్వాల్‌తో పాటు బీఎస్ఎఫ్ డిప్యూటీ స్పెషల్ డీజీ (పశ్చిమ) వైబీ ఖురానియాలను తొలగించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి కేబినెట్ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. తొలగింపు నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని, ఆ ఇద్దరు అధికారులను వారి రాష్ట్రాల కేడర్‌లకు పంపిస్తున్నట్టు స్పష్టం చేసింది.

నితిన్ అగర్వాల్ 1989వ బ్యాచ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి. గతేడాది జూన్‌లో బీఎస్‌ఎఫ్ చీఫ్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇక ఖురానియా 1990వ బ్యాచ్ ఒడిశా కేడర్‌కు చెందినవారు. ఈయన ప్రత్యేక డీజీగా(పశ్చిమ) పాకిస్థాన్ సరిహద్దు వెంబడి దళాన్ని పర్యవేక్షిస్తున్నారు.

కాగా అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత్‌లోకి నిరంతరం చొరబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. సమన్వయ లోపంతో పాటు పలు ముఖ్యమైన అంశాల విషయంలో నితిన్ అగర్వాల్‌పై ఫిర్యాదులు ఉన్నాయని చెబుతున్నాయి. బీఎస్ఎఫ్‌పై నియంత్రణ లేకపోవడం, ఇతర ఏజెన్సీలతో సమన్వయం లేకపోవడం వారిని సొంత రాష్ట్రాల కేడర్‌కు పంపించడానికి కారణమని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.

కాగా ఉగ్రవాద ఘటనలకు సంబంధించి బలగాల చీఫ్‌లను తొలగించడం ఇదే తొలిసారి. 2019లో పుల్వామా ఉగ్రదాడి జరిగినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఎవరినీ బాధ్యులను చేయలేదు. కాగా బీఎస్ఎఫ్ లో మొత్తం 2.65 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. పశ్చిమ దిక్కున పాకిస్థాన్, తూర్పు దిక్కున బంగ్లాదేశ్‌తో సరిహద్దులను ఈ బలగాలు సంరక్షిస్తున్నాయి.

కాగా ఇటీవల సరిహద్దుల వెంబడి ఉగ్రవాదుల కార్యకలాపాలు పెరిగాయి. గతవారం రాజౌరిలోని సైనిక శిబిరంపై దాడితో పాటు రెండు మూడు నెలలుగా పలు ఎన్‌కౌంటర్లు జరిగాయి.

  • Loading...

More Telugu News