Tie: టైగా ముగిసిన టీమిండియా-శ్రీలంక తొలి వన్డే

1st ODI between Team India and Sri Lanka ended as a tie

  • కొలంబోలో టీమిండియా × శ్రీలంక
  • మొదట 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 రన్స్ చేసిన శ్రీలంక
  • 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయిన టీమిండియా

మొన్న టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చింది. నేడు ఇరు జట్ల మధ్య తొలి వన్డే కూడా టై అయింది. 

కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో టీమిండియా కూడా సరిగ్గా 230 పరుగులే చేసింది. టీమిండియా 47.5 ఓవర్లలో ఆలౌట్ అయింది. 

టీమిండియా ఇన్నింగ్స్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 58, అక్షర్ పటేల్ 33, కేఎల్ రాహుల్ 31, శివమ్ దూబే 25, విరాట్ కోహ్లీ 24, శ్రేయాస్ అయ్యర్ 23 పరుగులు చేశారు. శుభ్ మాన్ గిల్ 16, వాషింగ్టన్ సుందర్ 5 పరుగులకు అవుటయ్యారు. 

శ్రీలంక బౌలర్లలో కెప్టెన్ చరిత్ అసలంక 3, వనిందు హసరంగ 3, దునిత్ వెల్లలాగే 2, అసిత ఫెర్నాండో 1 వికెట్ తీశారు. 

చివర్లో టీమిండియా విజయానికి 18 బంతుల్లో 5 పరుగులు కావాల్సి ఉండగా, చేతిలో రెండు వికెట్లు ఉన్నాయి. క్రీజులో శివమ్ దూబే, సిరాజ్ ఉన్నారు. ఇన్నింగ్స్ 48వ ఓవర్ విసిరిన శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక నాలుగో బంతికి శివమ్ దూబేను అవుట్ చేశాడు... ఆ తర్వాతి బంతికే అర్షదీప్ ను డకౌట్ చేయడంతో టీమిండియా ఇన్నింగ్స్ కు తెరపడింది. 

మూడు ఓవర్లలో 5 పరుగులే కదా... పైగా శివమ్ దూబే వంటి హార్డ్ హిట్టర్ క్రీజులో ఉన్నాడు... ఈజీగా గెలుస్తాం అని టీమిండియా భావించింది. కానీ అసలంక రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి టీమిండియా గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు. 

అంతకుముందు శ్రీలంక ఇన్నింగ్స్ లో లోయరార్డర్ లో వచ్చిన బౌలర్ దునిత్ వెల్లలాగే 65 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో అతడికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా, ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఆగస్టు 4న ఇదే మైదానంలో జరగనుంది.

More Telugu News