Ajay Shastri: టాలీవుడ్ దర్శకుడి మృతి... విషాదంలో మంచు మనోజ్

Manchu Manoj told firector Ajay Shastri is no more

  • మంచు మనోజ్ హీరోగా నేను మీకు తెలుసా? చిత్రాన్ని తెరకెక్కించిన అజయ్ శాస్త్రి
  • ఆ ఒక్క సినిమాతో తెరమరుగైన దర్శకుడు
  • తాజాగా అజయ్ శాస్త్రి ఇక లేడంటూ వెల్లడించిన మంచు మనోజ్

టాలీవుడ్ దర్శకుడు అజయ్ శాస్త్రి కన్నుమూశారు. అజయ్ శాస్త్రి గతంలో మంచు మనోజ్ హీరోగా 'నేను మీకు తెలుసా?' సినిమాకు దర్శకత్వం వహించారు. అజయ్ శాస్త్రి దర్శకత్వం వహించిన సినిమా ఇదొక్కటే. 

అజయ్ శాస్త్రి స్వస్థలం హైదరాబాద్. మొదట్లో సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ వద్ద రాఖీ, డేంజర్ చిత్రాలకు రచయితగా పనిచేశారు. 'నేను మీకు తెలుసా?' సినిమా ద్వారా 2008లో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్రంలో మంచు మనోజ్, స్నేహా ఉల్లాల్ జంటగా నటించారు. 

ఈ సినిమా మ్యూజికల్ హిట్ అయినప్పటికీ, కమర్షియల్ గా ఆశించిన ప్రయోజనం అందించలేకపోయింది. 'నేను మీకు తెలుసా?' చిత్రం తర్వాత అజయ్ శాస్త్రి పూర్తిగా తెరమరుగయ్యారు. ఇప్పుడు ఆయన మృతి చెందిన విషయం నటుడు మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో అందరికీ తెలిసింది. 

"నా బెస్ట్ ఫ్రెండ్, నేను మీకు తెలుసా? చిత్రం కెప్టెన్ ఇక లేరు. అజయ్ శాస్త్రి మరణవార్త నా హృదయాన్ని కలచివేసింది. ఆ బాధను వర్ణించడానికి మాటలు సరిపోవు. ఈ కష్టకాలంలో అతడి కుటుంబానికి, సన్నిహితులకు మనోధైర్యాన్ని అందించాలని ఆ పరమ శివుడ్ని ప్రార్థిస్తున్నాను. అజయ్ నిన్ను మిస్ అవుతున్నాం రా. మమ్మల్ని విడిచి త్వరగా వెళ్లిపోయావ్... నువ్వు లేని లోటు తెలుస్తూనే ఉంటుంది. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తుంటాం బాబాయ్" అంటూ మంచు మనోజ్ భావోద్వేగభరితమైన పోస్టు పెట్టారు.

Ajay Shastri
Director
Demise
Manchu Manoj
Nenu Meeku Telusaa?
Tollywood

More Telugu News