KTR: అసెంబ్లీలో మేం ఎలాంటి వీడియోలు తీయలేదు: కేటీఆర్

KTR says clarifies about brs video in assembly

  • తాము వీడియోలు తీశామని మంత్రి చెబుతున్నారన్న కేటీఆర్
  • తమ వైపు నుంచి అలాంటిదేమీ జరగలేదని స్పష్టీకరణ
  • చెక్ చేసుకొని చర్యలు తీసుకోవచ్చునన్న కేటీఆర్

తాము అసెంబ్లీలో వీడియోలు తీసినట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్నారని, కానీ అలాంటిదేమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. శుక్రవారం నాడు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... వీడియోలు తీశార‌ని మంత్రి చెబుతున్నారని, కానీ తమ వైపు నుండి అలాంటిది ఏమీ జరగలేదని స్పష్టం చేశారు. ఇక్కడ కెమెరాలన్నీ స్పీకర్ ఆధీనంలోనే ఉంటాయని... మీరు కావాలంటే మొత్తం చెక్ చేసుకోవచ్చునని సూచించారు.

మా వల్ల జరిగిందా? ఇక్కడున్న కెమెరాలు నిర్వహిస్తున్న ఏజెన్సీ వల్ల జరిగిందా? అనేది చెక్ చేసుకోవాలన్నారు. ప్రభుత్వం చట్టపరంగా ఏమైనా చర్య కూడా తీసుకోవచ్చునన్నారు. ప్ర‌ధాని నుంచి ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, ఎమ్మెల్యేలు, స్పీక‌ర్ల మీద వ్య‌క్తిత్వ హ‌న‌నం చేసే కార్య‌క్ర‌మం జ‌రుగుతుందన్నారు. దీనికి ఎవ‌రు అతీతులు కాదని, నెహ్రూ పాల‌న నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రుగుతూనే ఉన్నాయన్నారు. ఈ విషయంలో అంద‌రమూ బాధితుల‌మే అన్నారు.

స్వేచ్ఛను హరించే చట్టాలు వస్తున్నాయి

ప్ర‌జ‌ల భావ వ్య‌క్తీక‌ర‌ణ స్వేచ్ఛ‌ను హ‌రించేలా చ‌ట్టాలు వస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రం తీసుకొస్తున్న కొన్ని చ‌ట్టాల వ‌ల్ల పోలీసు రాజ్యం వ‌చ్చే ప్ర‌మాదం ఉందని వ్యాఖ్యానించారు. వీటికి కొన్ని స‌వ‌ర‌ణ‌లు తీసుకువ‌స్తే బాగుంటుంద‌ని తాము సూచించామన్నారు.

నాంప‌ల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివ‌ర్సిటీకి సుర‌వ‌రం ప్ర‌తాప్ రెడ్డి పేరు పెట్టాల‌ని గ‌త ప్ర‌భుత్వంలో కేసీఆర్ నిర్ణ‌యించార‌ని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గుర్తు చేశారు. పదేళ్ల పాటు విభ‌జ‌న ప్రక్రియ పూర్తి కాలేదు కాబ‌ట్టి ఆ పేరు పెట్ట‌లేక‌పోయామన్నారు. ఇప్పుడు విభ‌జ‌న పూర్తయింది కాబట్టి... తెలుగు యూనివ‌ర్సిటీకి సుర‌వ‌రం ప్ర‌తాప్ రెడ్డి పేరు పెడితే స్వాగ‌తిస్తామ‌న్నారు. 

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివ‌ర్సిటీకి సుర‌వరం ప్ర‌తాప్ రెడ్డి పేరును పెట్టేందుకు తమకు ఎలాంటి భేష‌జాలు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ స‌భ‌లో ఉన్న ఇత‌ర స‌భ్యులు ఒప్పుకుంటే తమకు ఎలాంటి అభ్యంత‌రం లేదన్నారు.

More Telugu News