Rohit Sharma: రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ.. ఇద్దరిలో బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. రవిశాస్త్రి సమాధానం ఇదే!

Rohit Sharma and MS Dhoni both are on par when it comes to tactics in the white ball crickeet

  • వ్యూహాల విషయంలో ఇద్దరూ సమానమేనన్న మాజీ దిగ్గజం
  • టీ20 క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా రోహిత్ నిలిచిపోతాడని ప్రశంస
  • అత్యుత్తమ కెప్టెన్‌లలో ఒకడిగా మిగిలిపోతాడని వ్యాఖ్య
  • అంతకు మించి రోహిత్ శర్మకు ప్రశంస ఇవ్వలేనన్న రవిశాస్త్రి

భారత్ జట్టు టీ20 వరల్డ్ కప్-2024 గెలవడంలో కెప్టెన్ రోహిత్ శర్మ అత్యంత కీలక పాత్ర పోషించాడు. తన వ్యూహాలతో భారత్‌ను విజేతగా నిలిపాడు. టీ20 కెప్టెన్‌గా ఐసీసీ ఈవెంట్లతో పాటు ఐపీఎల్‌లో కూడా అతడికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. దీంతో భారత మాజీ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీతో రోహిత్ శర్మ సమానమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి వీరిద్దరిలో ఎవరు ఉత్తమ కెప్టెన్ అనే ప్రశ్నకు భారత మాజీ దిగ్గజం రవిశాస్త్రి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

మైదానంలో వ్యూహాలు రచించడంలో రోహిత్ శర్మ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడనే విషయాన్ని మరచిపోకూడదని రవిశాస్త్రి అన్నారు. అత్యుత్తమ కెప్టెన్లలో ధోనీతో పాటు రోహిత్ శర్మ కూడా ఒకడిగా నిలిచిపోతాడని శాస్త్రి చెప్పారు. వీరిద్దరిలో ఎవరు ఉత్తమం అని తనను అడిగితే పరిమితి ఓవర్ల క్రికెట్‌లో వ్యూహాల పరంగా ఇద్దరూ సమానంగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రోహిత్‌ శర్మకు తాను అంతకన్నా పెద్ద ప్రశంస ఇవ్వలేనని అన్నారు. ఎందుకంటే ఎంఎస్ ధోనీ ఏం సాధించాడో, ఎన్ని టైటిల్స్ గెలిపించాడో అందరికీ తెలుసునని శాస్త్రి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఐసీసీ రివ్యూలో ఆయన ఆసక్తికరంగా స్పందించారు.

ఫైనల్ మ్యాచ్‌లో క్లిష్ట సమయంలో ప్రశాంతంగా ఉండి.. సరైన సమయంలో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌లతో రోహిత్ వ్యూహాత్మకంగా బౌలింగ్ చేయించాడని, మ్యాచ్ చూస్తున్నప్పుడు ఈ దృశ్యాలు చాలా బాగున్నాయని చెప్పారు. వన్డే, టీ20 క్రికెట్‌‌లో ఆల్ టైమ్ దిగ్గజాల్లో రోహిత్ ఒకడని తాను భావిస్తున్నానని, ఇప్పటివరకు ఆడిన అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచిపోతాడని అన్నారు. ప్రపంచ కప్ గెలుపు అనంతరం టీ20 ఫార్మాట్‌కు రోహిత్ శర్మ గుడ్‌బై చెప్పడంపై రవి శాస్త్రి ఈ విధంగా స్పందించారు.

కాగా ఎంఎస్ ధోనీ సారధ్యంలో భారత జట్టు 2007లో టీ20 ప్రపంచ కప్, 2011‌లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. ఇక రోహిత్ శర్మ సారధ్యంలో భారత జట్టు కేవలం టీ20 వరల్డ్ కప్ మాత్రమే గెలిచింది. టీ20 ఫార్మాట్‌లో ఇద్దరూ పెద్ద సంఖ్యలో భారత్‌కు విజయాలు సాధించిపెట్టారు.

  • Loading...

More Telugu News