Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కోసం హైదరాబాద్‌కు పోలీసు బృందాలు!

Police teams to Hyderabad for Vallabhaneni Vamsi

  • గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 71వ నిందితుడుగా వంశీ
  • అరెస్టుకు సిద్దమైన కృష్ణాజిల్లా పోలీసులు
  • వంశీ కోసం రంగంలోకి మూడు ప్రత్యేక బృందాలు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసి వరుసగా రెండు పర్యాయాలు (2014, 2019 ఎన్నికల్లో) ఎమ్మెల్యేగా విజయం సాధించి ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు పొందారు. అయితే 2019 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వైసీపీ మద్దతుదారుడు అయ్యారు. అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోకపోయినా ఆ పార్టీ నేతగా టీడీపీపై, చంద్రబాబుపై విమర్శలు చేస్తూ వచ్చారు. చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగతంగా తీవ్ర స్థాయి విమర్శలు చేయడంతో ఆ పార్టీ శ్రేణులకు శత్రువుగా మారారు. వంశీపై అభిమానం ఉన్నప్పటికీ నియోజకవర్గంలో సొంత సామాజిక వర్గం నేతలు ఆయనకు దూరం అయ్యారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయాన్ని చవిచూశారు.
 
రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో గతంలో టీడీపీ, చంద్రబాబుపై ఒక రేంజ్‌లో విరుచుకుపడిన నేతలకు చుక్కలు చూపించడం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు భావిస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని 71వ నిందితుడుగా పోలీసులు చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే 18 మందిని అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా, ఎమ్మెల్యేగా ఆయన సూచనల మేరకే ఆ పార్టీ శ్రేణులు విధ్వంసం సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే బాపులపాడు ఎంపీపీ నగేష్ సహా 15 మందిని గత నెల 9వ తేదీన అరెస్టు చేశారు. ఆ తరువాత మరో ముగ్గురిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ కేసులో మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు.
 
అయితే .. ఈ కేసులో వంశీ సహా పలువురు కీలక నిందితులను వదిలివేశారని టీడీపీ శ్రేణుల నుండి విమర్శలు వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో వంశీ చేసిన తీవ్ర వ్యాఖ్యలు, చేసిన ప్రవర్తనపై గుర్రుగా ఉన్న టీడీపీ నేతలు .. వంశీని అరెస్టు చేయించాలని అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకువచ్చారని అంటున్నారు. దీంతో ఇటీవలే జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గంగాధరరావు గన్నవరం ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టారని సమాచారం. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత వల్లభనేని వంశీ నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు.
 
వంశీ కుటుంబం హైదరాబాద్‌లోనే నివసిస్తుండటంతో ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన కూడా అక్కడే ఉంటున్నారని సమాచారం. ఈ క్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన మూడు ప్రత్యేక పోలీసు బృందాలు నిన్న (గురువారం) హైదరాబాద్‌కు వెళ్లడంతో వంశీని అరెస్టు చేసేందుకే వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే తిరుపతి ఘటన (పులవర్తి నానిపై హత్యాయత్నం)లో చంద్రగిరి వైసీపీ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని బెంగళూరు ఎయిర్ పోర్టులో అరెస్టు చేసిన పోలీసులు ఆయనకు 41ఏ కింద నోటీసులు అందజేసి వదిలివేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో వంశీని ఈ కేసులో అరెస్టు చేసి కోర్టుకు హజరు పరుస్తారా? లేక 41ఏ నోటీసులు ఇచ్చి పోలీసులు పంపుతారా? అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.  

  • Loading...

More Telugu News