Allu Arjun: బాలీవుడ్ పై అల్లు అర్జున్ మాటల్లో నిరాశ కనిపించింది: నిఖిల్ అద్వానీ

Nikhil Advani recalls Allu Arjun opinion on Bollywood
  • బాలీవుడ్ లో ఇటీవల కాలంలో తగ్గిన సక్సెస్ రేటు
  • బాలీవుడ్ కు ఏమైందని అల్లు అర్జున్ ఓసారి తనను అడిగారన్న నిఖిల్ అద్వానీ
  • అల్లు అర్జున్ చెప్పింది నిజమే అనిపించిందని వెల్లడి
గత కొంతకాలంగా బాలీవుడ్ లో సక్సెస్ రేటు తగ్గింది. బ్లాక్ బస్టర్ హిట్ అనదగ్గ చిత్రాలేవీ ఇటీవల కాలంలో బాలీవుడ్ నుంచి రాలేదన్నది వాస్తవం. అదే అంశంపై స్పందించిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నిఖిల్ అద్వానీ ఓసారి అల్లు అర్జున్ తనతో బాలీవుడ్ గురించి ఏమన్నారో వెల్లడించారు. 

గతంలో తాను అల్లు అర్జున్ తో ఓ సినిమా తెరకెక్కించాలనుకున్నానని నిఖిల్ అద్వానీ తెలిపారు. ఇద్దరం కలిసి ఓ ప్రాజెక్టు చేద్దాం అని ప్రతిపాదించానని, ఆ సమయంలో బాలీవుడ్ పరిస్థితిపై అల్లు అర్జున్ మాటల్లో నిరాశ కనిపించిందని అన్నారు. 

బాలీవుడ్ కు ఏమైంది? హీరోలను ఎలా చూపించాలనే విషయం మీరందరూ మర్చిపోయినట్టున్నారు అని అల్లు అర్జున్ అన్నారని నిఖిల్ అద్వానీ గుర్తుచేసుకున్నారు. అల్లు అర్జున్ చెప్పింది నిజమే అనిపించిందని తెలిపారు. 

దక్షిణాది సినిమాల్లో హీరోయిజం ఎలివేట్ చేసే విధానానికి, భావోద్వేగాలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఆఖరికి నీటిపారుదల, ఇతిహాసాలు వంటి సబ్జెక్టులతో తెరకెక్కిన సినిమాల్లో కూడా హీరోలను గొప్పగా చూపిస్తారని కొనియాడారు. 

ఒకప్పటి బాలీవుడ్ సినిమాలతో పోల్చితే, ఇప్పటి బాలీవుడ్ సినిమాల్లో హీరోయిజంకు ప్రాముఖ్యత ఇవ్వడం తగ్గిందని అంగీకరించారు. గతంలో కాలియా, కూలీ చిత్రాల్లో అమితాబ్ బచ్చన్... కభీ హా కభీ నా చిత్రంలో షారుఖ్ ఖాన్ హీరోయిజాన్ని చక్కగా పండించారని నిఖిల్ అద్వానీ వివరించారు.
Allu Arjun
Nikhil Advani
Bollywood
Icon Star
Tollywood

More Telugu News