Pensions: ఏపీలో రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ... మధ్యాహ్నానికి 91 శాతం పూర్తి

AP Govt completes 91 percent pension distribution till after noon

  • రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ
  • పింఛన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
  • మధ్యాహ్నం 12.30 గంటలకు 91.83 శాతం పంపిణీ పూర్తి  

ఏపీలో రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరుగుతోంది. ఉదయం పెన్షన్ల పంపిణీ ప్రారంభమైన రెండున్నర గంటల వ్యవధిలోనే 63 శాతం పూర్తవగా, మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతానికి 91.83 శాతం పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు. 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం ఆరు గంటల నుండే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి రోజే 96 శాతం పైగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్ లకు ఆదేశాలు ఇచ్చారు.

లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇళ్ల వద్దనే పింఛన్ల పంపిణీ చేసే విషయాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పెన్షన్ల పంపిణీని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వేగంగా నిర్వహిస్తున్నారు. రెండు రోజుల్లోనే 100 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి 59,56,439 మందికి (91.83 శాతం) రూ.2513.65 కోట్ల మేర పెన్షన్ల పంపిణీ జరిగింది. 

ప్రభుత్వ ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు , కలెక్టర్ లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇవాళ పింఛన్ల పంపిణీలో పాల్గొననున్నారు. అనంతపురం జిల్లా గుండుమల గ్రామం వెళ్లి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని పింఛన్ల పంపిణీ తీరుపై లబ్ధిదారులతో మాట్లాడనున్నారు.

కాగా, గత నెలలో పెరిగిన పెండింగ్ పెన్షన్ తో కలిపి రూ.7వేల చొప్పున పంపిణీ చేసిన ప్రభుత్వం.. ఈ నెల నుండి రూ.4 వేల పింఛన్ పంపిణీ చేస్తోంది. పెరిగిన పెన్షన్ పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

పింఛన్ల పంపిణీపై మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఒకటో తేదీ తెల్లవారున ఆరు గంటలకే పెంచిన పింఛను రూ.4000 ఇంటి వద్దే అందుకున్న అవ్వాతాతల మోముల్లో చిరునవ్వులే మా కూటమి ప్రభుత్వానికి దీవెనలు అని పేర్కొన్నారు. పింఛన్లు అందుకున్న వితంతువులు, దివ్యాంగులు చెబుతున్న కృతజ్ఞతలే మాకు ఆశీస్సులు అని వివరించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందుకున్న లక్షలాది మంది వ్యక్తం చేసిన ఆనందమే కూటమి ప్రభుత్వానికి అందిన వెలకట్టలేని బహుమానం అని లోకేశ్ ట్వీట్ చేశారు.

More Telugu News