IPL owners meeting: 'ఐపీఎల్2025 మెగా వేలం'పై బీసీసీఐ సమావేశంలో షారుఖ్ ఖాన్‌ ఆగ్రహం.. కావ్య మారన్ మద్దతు!

Shah Rukh Khan argued against hosting a mega auction 2025 in IPL owners meeting at the BCCI Headquarters

  • ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలాన్ని తప్పుబట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యజమాని
  • మినీ వేలం చాలని సూచన
  • సమర్థించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కో-ఓనర్ కావ్యా మారన

బుధవారం ముంబైలో ఐపీఎల్ ఫ్రాంచైజీ యాజమాన్యాలతో బీసీసీఐ సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. అయితే ఐపీఎల్-2025కి ముందు ఆటగాళ్ల మెగా వేలం నిర్వహించొద్దంటూ కోల్‌కతా నైట్ రైడర్స్ సహ-యజమాని షారుఖ్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మినీ వేలం నిర్వహిస్తే సరిపోతుందని బీసీసీఐ ముందు ఆయన ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే షారుఖ్‌ వాదనతో పంజాబ్ కింగ్స్ సహ యజమాని నెస్ వాడియా తీవ్ర వాగ్వాదానికి దిగినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. 

కాగా ఆటగాళ్ల మెగా వేలం అంశంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌.. షారుఖ్ ఖాన్‌కు మద్దతు ప్రకటించారు. బీసీసీఐ సమావేశం ముగిసిన తర్వాత క్రికెట్ వార్తలు అందించే ‘క్రిక్‌బజ్‌’ వెబ్‌సైట్‌కి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఐపీఎల్-2025కి ముందు మెగా వేలానికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడారు.

ఒక జట్టును రూపొందించడానికి చాలా సమయం పడుతుందని, యువ ఆటగాళ్లు మెరుగుపడడానికి కొంత సమయం, పెట్టుబడి కూడా అవసరమవుతాయని కావ్యా మారన్ వ్యాఖ్యానించారు. యువ క్రికెటర్ అభిషేక్ శర్మ స్థిరమైన ప్రదర్శన చేయడానికి మూడు సంవత్సరాలు పట్టిందని, ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తారని ఆమె ప్రస్తావించారు. ఇతర జట్లలో కూడా ఇటువంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయని అన్నారు. మొత్తంగా మెగా వేలం పట్ల ఆమె వ్యతిరేకత వ్యక్తం చేశారు. కాగా ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఛాంపియన్‌గా నిలవడగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

బీసీసీఐ భేటీలో కీలక అంశాలపై చర్చ..
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఆటగాళ్ల నిబంధనలను ఖరారు చేసేందుకు మొత్తం 10 ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులతో బీసీసీఐ సమావేశమైంది. యజమానులు చేసిన సిఫార్సులను టోర్నమెంట్ గవర్నింగ్ కౌన్సిల్‌కు పంపుతామని తెలిపింది. మెగా వేలం, ఆటగాళ్ల రిటెన్షన్, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌తో పాటు ఇతర అంశాలకు కూడా చర్చించారు.

రాబోయే సీజన్‌కు సంబంధించి వివిధ అంశాలపై వివరణాత్మకంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఆటగాళ్ల నిబంధనలు, సెంట్రల్ మర్చండైజింగ్, లైసెన్సింగ్‌తో పాటు ఇతర వ్యాపార అంశాలపై కూడా యజమానులు అభిప్రాయాలను అందించారని సమాచారం. ఐపీఎల్ ఆటగాళ్ల నిబంధనలను రూపొందించడానికి ముందు ఈ సిఫార్సులను బీసీసీఐ పరిగణనలోకి తీసుకోనుంది. ఇందులో భాగంగా తదుపరి చర్చలు, నిబంధనల పరిశీలన కోసం ఈ సిఫార్సులను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు పంపించనున్నట్టు బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు.

More Telugu News