Sand: మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష... వివరాలు ఇవిగో!

Chandrababu reviews on mining dept


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు మైనింగ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. గత ఐదేళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయ వనరులపై ఈ సమావేశంలో చర్చించారు. ఇసుక తవ్వకాల్లో ప్రైవేటు ఏజెన్సీలతో ఒప్పందాలపై సమీక్షించారు. ఒప్పందాల ద్వారా అక్రమాలు జరిగాయని, ప్రభుత్వానికి నష్టం జరిగిందని గుర్తించారు. గడచిన ఐదేళ్లలో మైనింగ్ శాఖ ఆదాయం 7 శాతమేనని నిర్ధారించారు. 

ఇసుక తవ్వకాల్లో ప్రైవేటు ఏజెన్సీలు చెల్లింపులు చేయలేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రభుత్వానికి రూ.1,025 కోట్లు చెల్లించలేదని వెల్లడించారు. అక్రమాలపై కేసులు నమోదు చేశామని సీఎంకు వివరించారు. మైనింగ్ శాఖలో అస్తవ్యస్త విధానాల వల్ల సమస్యలు తలెత్తాయని తెలిపారు. 

నేటి సమావేశంలో... ఉచిత ఇసుక పాలసీ అమలు, వివిధ ప్రాంతాల్లో ఇసుక లభ్యత, ధరలపై సమీక్షించారు. రవాణా ఖర్చుల వల్ల కొన్ని చోట్ల తక్కువ ధరకు ఇసుక దొరకని అంశంపైనా చర్చించారు. తవ్వకం, రవాణా ఖర్చులు భారం కాకుండా ఎలా వెళ్లాలనే అంశంపై కూడా సీఎం చంద్రబాబు అధికారులతో చర్చించారు. 

అవసరం ఉన్న వారు రీచ్ నుంచి నేరుగా ఇసుక తీసుకెళితే భారం ఉండదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఉచిత ఇసుక విధానానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇసుక వినియోగదారులకు భారం కారాదని అధికారులకు సీఎం నిర్దేశించారు.

Sand
Mining
Chandrababu
Review
Andhra Pradesh
  • Loading...

More Telugu News