Sirivennela: ఆ ఒక్క మాటతో శాస్త్రిగారు నన్ను కొడుకులా చూసుకున్నారు: ఆర్పీ పట్నాయక్ 

RP Patnaik Interview

  • సిరివెన్నెల గురించి ప్రస్తావించిన ఆర్పీ
  • ఆయనతో అనుబంధం మరిచిపోలేనిదని వ్యాఖ్య 
  • తన ధోరణి ఆయనకి నచ్చిందని వెల్లడి 
  • అప్పటి నుంచి తనని వదిలిపెట్టలేదన్న ఆర్పీ    


సిరివెన్నెల రాసిన ప్రతి పాట ఒక అనుభూతి పరిమళం .. జ్ఞాపకాల జలపాతం. అలాంటి సిరివెన్నెలను ఆయనతో కలిసి పనిచేసిన ప్రతి సంగీత దర్శకుడు ఇష్టపడుతూ ఉంటారు. ఈటీవీ వారు నిర్వహిస్తున్న 'నా ఉచ్ఛ్వాసం కవనం' కార్యక్రమంలో, సిరివెన్నెలతో తనకి గల అనుబంధాన్ని గురించి ఆర్పీ పట్నాయక్ పంచుకున్నారు. 

" శాస్త్రిగారు అంటే మొదటి నుంచి కూడా నాకు గౌరవ భావం ఉండేది. ఆయనతో నేను కలిసి పనిచేసిన మొదటి సినిమా 'మనసంతా నువ్వే'. అయితే అంతకంటే ముందుగా మేమిద్దరం ఒక సినిమాకి కలిసి పనిచేశాము. కానీ ఆ ప్రాజెక్టులో నుంచి నేను బయటికి రావలసి వచ్చింది. అందువలన 'మనసంతా నువ్వే' సినిమానే మేము కలిసి పనిచేసిన మొదటి సినిమాగా చెప్పుకోవాలి. 

"కొంతకాలం తరువాత .. 'మొదటి సినిమా నుంచి ఎందుకు బయటికి వెళ్లిపోవలసి వచ్చింది?' అని శాస్త్రిగారు అడిగారు. 'ఎథిక్స్ ఒప్పుకోకపోవడం వలన బయటికి వచ్చేశాను సార్' అన్నాను నేను'. 'ఏంటి .. ఫస్టు సినిమా విషయంలో ఎథిక్స్ కి ప్రిఫరెన్స్ ఇచ్చావా నువ్వు?' అన్నారు. ' ఎందుకో అది కరెక్టు కాదని అనిపించి వచ్చేశాను సార్' అన్నాను. అంతే ఆ ఒక్క మాట తరువాత నన్ను శాస్త్రిగారు వదిలిపెట్టలేదు. ఒక కొడుకులా నన్ను చూసుకున్నారు. 

ఇతనికి నైతిక విలువలు ఉన్నాయి .. వాటి కోసం మొదటి సినిమాను కూడా కేర్ చేయలేదు అనే ఒక ఆలోచన కారణంగా ఆయనకి నేను నచ్చాను. ఆయనను కలవాలంటే ఎవరైనా అపాయింట్ మెంట్ తీసుకోవాలేమోగానీ, ఏ వేళలో అయినా అపాయింట్ మెంట్ లేకుండా వెళ్లే ఫ్రీడమ్ నాకు ఉండేది .. ఆయనతో అనుబంధం మరిచిపోలేనిది" అని చెప్పారు. 

More Telugu News