Karnataka: తీర్థయాత్రల్లో తప్పిపోయిన కుక్క.. 250 కిలోమీటర్లు ప్రయాణించి యజమానిని చేరిన వైనం!
- కర్ణాటక నుంచి మహారాష్ట్రకు తీర్థయాత్రకు వెళ్లిన వ్యక్తి
- గ్రామంలోని కుక్క అతడినే అనుసరిస్తూ వెళ్లిన వైనం
- మహారాష్ట్రలోని పండరీపురంలో తప్పిపోయిన కుక్క
- కొన్ని రోజులకు కర్ణాటకలో యజమాని వద్దకు చేరిన వైనం
తీర్థయాత్రలకు వెళ్లిన యజమానిని అనుసరించిన ఓ కుక్క అక్కడ తప్పిపోయింది. చివరకు 250 కిలోమీటర్లు ప్రయాణించి యజమాని వద్దకు తిరిగొచ్చింది. కర్ణాటకలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే, ఉత్తర కర్ణాటకలోని బెళగావికి చెందిన కమలేశ్ కుంభర్ ప్రతిఏటా మహారాష్ట్రలోని పండరీపురంకు పాదయాత్రగా వెళుతుంటారు.
ఈసారి జూన్ చివరి వారంలో బయలుదేరిన కమలేశ్‌ను గ్రామంలో ఉండే కుక్క కూడా అనుసరించింది. దాదాపు 250 కిలోమీటర్ల మేర కుక్క కమలేశ్ వెంట నడిచింది. విఠోబా గుడిలో దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన కమలేశ్‌కు కుక్క మాత్రం కనిపించలేదు. మరో భక్తజన బృందంతో అది వెళ్లిందని స్థానికులను అడగ్గా వారు చెప్పారు. శునకం కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో, ఆయన తిరిగొచ్చేశారు. అయితే, జులై 14న హఠాత్తుగా అది కమలేశ్ ఇంటిముందు ప్రత్యక్షమవడంతో ఆయన ఆనందానికి అంతేలేకుండా పోయింది.
కుక్కను చూసి గ్రామస్థులందరూ సంబరపడ్డారు. ఆ కుక్క పేరు మహరాజ్ అని, దానికి భజనలు వినడమంటే ఇష్టమని కమలేశ్ చెప్పాడు. గతంలోనూ తన వెంట కొన్ని పాదయాత్రలకు కుక్క వచ్చిందని తెలిపాడు. వయసు మీద పడినా ఈ శునకం దాదాపు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వెనక్కు రావడం నిజంగా అద్భుతమని స్థానికులు అంటున్నారు. కుక్క ఆరోగ్యంగానే ఉందని కూడా చెప్పారు. మహరాజ్ మళ్లీ తమ గ్రామానికి తిరిగొచ్చిన నేపథ్యంలో గ్రామస్థులు విందు కూడా ఏర్పాటు చేశారు.