India vs Srilanka 3rd T20: మూడవ టీ20లో శ్రీలంకపై భారత్ ఉత్కంఠభరిత ‘సూపర్ ఓవర్’ విజయం

India win against Sri Lanka with thrilling super over

  • సమమైన ఇరు జట్ల స్కోర్లు.. మ్యాచ్ టై
  • సూపర్ ఓవర్‌లో భారత్ సునాయాస విజయం
  • మూడు మ్యాచ్‌ల 3-0 సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్

శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ వైట్‌వాష్ చేసింది. మంగళవారం పల్లెకెలె వేదికగా జరిగిన మూడవ టీ20లో ఉత్కంఠభరితమైన విజయాన్ని సాధించింది. సూపర్ ఓవర్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగా.. ఆతిథ్య శ్రీలంక కూడా 20 ఓవర్లు ఆడి 8 వికెట్లు కోల్పోయి సరిగ్గా 137 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్ జరిగింది.

138 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఒకానొక దశలో 110/1 స్కోరుతో పటిష్ఠంగా కనిపించింది. ఆ దశలో భారత బౌలర్లు పుంజుకోవడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. మరో 22 పరుగులు జోడించే లోపు ఆ జట్టు ఏకంగా 7 వికెట్లు కోల్పోయింది. రింకూ సింగ్ ఒక ఓవర్‌లో 2 వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.

చివరి ఓవర్‌లో శ్రీలంకకు 6 పరుగులు అవసరమైన దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బంతి అందుకున్నాడు. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది.

సూపర్‌ ఓవర్‌ లో ఎలాంటి ఉత్కంఠ లేకుండానే భారత్ సునాయాసంగా గెలిచింది. శ్రీలంక మొదట బ్యాటింగ్ చేయగా కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్ ఓపెనింగ్ చేశారు. వాషింగ్టన్ సుందర్‌కు కెప్టెన్ సూర్య బంతి అందించాడు. శ్రీలంక మొదటి మూడు బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో ఆ జట్టు కథ ముగిసింది. 3 పరుగుల లక్ష్యంతో శుభ్‌మాన్‌ గిల్‌, సూర్య కుమార్‌ యాదవ్‌లు బ్యాటింగ్‌ ఆరంభించారు. మహేశ్‌ తీక్షణ వేసిన ఈ ఓవర్‌లో తొలి బంతినే సూర్య ఫోర్ కొట్టాడు. దీంతో భారత్ సూపర్ ఓవర్ విజయం సాధించింది.

More Telugu News