Wayanad Landslides: వయనాడ్ లో పరిస్థితులను సమీక్షిస్తున్న ప్రధాని మోదీ
- కేరళలోని వయనాడ్ లో విరిగిపడిన కొండచరియలు
- 125కి చేరిన మృతుల సంఖ్య
- కేరళ ప్రజలకు మోదీ సర్కారు అన్ని విధాలా సాయం చేస్తుందన్న కేంద్ర మంత్రి కురియన్
కేరళలోని వయనాడ్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 125కి చేరింది. మరో 98 మంది గల్లంతయ్యారు. కాగా, వయనాడ్ లో పరిస్థితులను ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షిస్తున్నారని కేంద్ర సహాయమంత్రి జార్జ్ కురియన్ వెల్లడించారు.
వయనాడ్ లో కొనసాగుతున్న సహాయక చర్యలను మోదీ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ కష్టకాలంలో కేరళ ప్రజలకు అన్ని రకాల సహకారం అందించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని జార్జ్ కురియన్ స్పష్టం చేశారు.
కాగా, వయనాడ్ లో జరుగుతున్న సహాయక చర్యల బాధ్యతలను కేంద్రం జార్జ్ కురియన్ కు అప్పగించింది. గల్లంతైన వారి కోసం రెండు ఎన్టీఆర్ఎఫ్ బృందాలు, రెండు ఆర్మీ బృందాలు, రెండు వాయుసేన హెలికాప్టర్లను రంగంలోకి దించామని కురియన్ చెప్పారు. సహాయక చర్యలు, గాలింపు చర్యల కోసం మరిన్ని బలగాలను రప్పిస్తున్నామని చెప్పారు.