Krishna Bhagavan: నాక్కొంచెం లౌక్యం తక్కువ: నటుడు కృష్ణభగవాన్

Krishna Bhagavan Interview

  • హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణభగవాన్ 
  • గోదావరి నీళ్లలోనే వెటకారం ఉందన్న నటుడు 
  • వంశీతో పరిచయం గురించిన ప్రస్తావన 
  • అల్లరి నరేశ్ తో చనువు ఎక్కువని వెల్లడి


కృష్ణభగవాన్ ఒకప్పుడు బిజీ కమెడియన్. బ్రహ్మానందం .. ఎమ్మెస్ నారాయణ .. ధర్మవరపు .. వేణుమాధవ్ .. ఇలా చాలామంది కమెడియన్స్ ఉన్నప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారాయన. అలాంటి కృష్ణభగవాన్ 'హిట్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు.

"కాలేజ్ రోజుల్లో నాటకాలు ఆడేవాడిని .. మిమిక్రీ చేసేవాడిని. అదే నన్ను వంశీ వరకూ తీసుకుని వెళ్లింది. 'మహర్షి' సినిమా నుంచి వంశీతో నా సాన్నిహిత్యం పెరిగింది. వెటకారమనేది గోదావరి నీళ్లలోనే ఉంది. అందువల్లనే అది నాకూ వచ్చింది. సినిమాల పరంగా నాకు చాలా హెల్ప్ అయింది" అని అన్నారు. 

"మొదటినుంచీ నేను చాలా సరదా మనిషిని. నేను సినిమాల్లోకి రాకముందే, ఏదైనా పనిపై బయటికి వెళ్లి వచ్చినప్పుడు .. 'రామానాయుడుగారు గానీ .. రాఘవేంద్రరావుగారు గాని కాల్ చేశారా?' అని సరదాగా ఇంట్లో వాళ్లను అడిగేవాడిని. అప్పుడు వాళ్లు నవ్వుతూ 'రామోజీరావుగారు చేశారు' అనేవారు. ఒకరోజున నిజంగానే నా కోసం రామానాయుడు గారు కాల్ చేశారు. ఆ రోజును .. ఆ క్షణాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. ఇదే మాటను రామానాయుడిగారితోను చెప్పాను" అన్నారు. 

" నేను సరదాగా మాట్లాడతాను .. జోవియల్ గానే ఉంటాను. కానీ పెద్దగా లౌక్యం తెలియదు. నాకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడానికి అదే కారణమని నేను అనుకుంటున్నాను. కమెడియన్స్ లో రఘుబాబుతో .. హీరోల్లో అల్లరి నరేష్ తో ఎక్కువ చనువుగా ఉంటాను. నటుడిగా ఈ రోజున ఈ స్థాయి గుర్తింపును సంపాదించుకోవడం పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నాను" అని ఆయన చెప్పారు. 

More Telugu News