Sharmila: కేంద్ర మంత్రి పెమ్మసాని చేసిన వ్యాఖ్యలు అనుమానాలు కలిగిస్తున్నాయి: షర్మిల

Sharmila demands clarity on Aarogya Sri implement in AP

  • అందరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని పెమ్మసాని అంటున్నారన్న షర్మిల
  • దానర్థం ఇక ఆరోగ్యశ్రీ లేనట్టేనా? అంటూ షర్మిల సందేహం
  • కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ 

ఆరోగ్య శ్రీ పథకం అమలుపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు అనుమానాలు కలిగిస్తున్నాయని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని పెమ్మసాని అంటున్నారని, దానర్థం రాష్ట్రంలో ఇక ఆరోగ్యశ్రీ లేనట్టేనా? అని షర్మిల సందేహం వ్యక్తం చేశారు. 

కేవలం ఆయుష్మాన్ భారత్ పథకాన్నే అమలు చేయాలనుకుంటున్నారా? మీ కూటమి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని నిలిపివేసే ఆలోచన చేస్తోందా? అందుకే ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారా? పెండింగ్ లో ఉన్న బకాయిల చెల్లింపుపై ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. 

బిల్లులు చెల్లించే మీ ప్రభుత్వమే బిల్లులు రావడం లేదు అని సమాధానం చెబుతోంది... ఇది దేనికి సంకేతం? ఆయుష్మాన్ భారత్ కింద కేంద్రం ఇచ్చే 5 లక్షలతోనే సరిపెడితే మరి రాష్ట్రం ఇచ్చేది ఏమీ లేదా? ఆరోగ్యశ్రీ కింద ఇక వైద్యం ఉండదని చెప్పకనే చెబుతున్నారా? అని షర్మిల నిలదీశారు. 

"గత వైసీపీ ప్రభుత్వం రూ.1,600 కోట్ల బకాయిలు పెండింగ్ లో పెట్టింది. దాంతో ఆసుపత్రులు కేసులను తీసుకోవడమే మానేశాయి. ఇప్పుడు కూటమి మంత్రుల మాటలు పథకం అమలుకే పొగపెట్టేలా ఉన్నాయి. దీనికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి. 

ఆరోగ్యశ్రీ... డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన అద్భుత పథకం. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకానికి కూడా ఆరోగ్యశ్రీనే ఆదర్శనం. ఇలాంటి పథకాన్ని నీరుగార్చాలని చూస్తే సహించేది లేదు. 

ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకంపై వెంటనే స్పష్టత ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్న రూ.1,600 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. ఆరోగ్య శ్రీ పథకానికి ఏ లోటు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం" అని షర్మిల పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News