KTR: తెల్లవారుజాము వరకు అసెంబ్లీ... శ్రీధర్ బాబుకు కేటీఆర్ కీలక సూచన

KTR suggestion to Sridhar Babu about sesstions

  • వచ్చే సెషన్‌ను 20 రోజుల పాటు నిర్వహించాలని సూచన
  • సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దన్న ప్రతిపాదనను అంగీకరిస్తున్నామని వెల్లడి
  • తమ నుంచి సహకారం ఉంటుందని కేటీఆర్ హామీ

నిన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ సుదీర్ఘంగా సాగిన నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుకు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కీలక సూచన చేశారు. సమావేశాలకు తాము సహకరిస్తామని, వచ్చే సెషన్‌ను 20 రోజుల పాటు నిర్వహించాలని సూచించారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన అనంతరం సభాపతి ప్రసాద్ కుమార్ అనుమతితో ఈ సూచన చేశారు.

ఒకేరోజు 19 ప‌ద్దుల‌పై చ‌ర్చ జ‌రిపి అప్రూవ్ చేసుకోవాల‌నే ఉద్దేశంతో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభను మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున‌ 3 గంట‌ల వ‌ర‌కు నడిపారని తెలిపారు. సుదీర్ఘ ప్ర‌సంగాలు చేయొద్ద‌న్న శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల మంత్రి ప్ర‌తిపాద‌న‌ను అంగీక‌రిస్తున్నామన్నారు. కానీ ఈ స‌భ‌లో 57 మంది కొత్త స‌భ్యులు ఉన్నారని.. వారూ మాట్లాడాల‌ని అనుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలా రోజుకు 19 ప‌ద్దుల‌పై చ‌ర్చ పెట్ట‌కుండా... రోజుకు 2 లేదా 3 ప‌ద్దుల‌పై చ‌ర్చ పెట్టాల‌ని కోరుతున్నామన్నారు.  

ఈ స‌మావేశాలు అయిపోయాయని... కానీ వ‌చ్చే అసెంబ్లీ, బ‌డ్జెట్ స‌మావేశాల్లో రోజుకు 19 ప‌ద్దులు పెట్ట‌కుండా, 2 లేదా 3 ప‌ద్దుల‌పై సావ‌ధానంగా చ‌ర్చ జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకోవాలని సూచించారు. మంత్రులు కూడా సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. వ‌చ్చే సెష‌న్‌ను అవ‌స‌ర‌మైతే 20 రోజులు పెట్టాలన్నారు. తమ వైపు నుంచి త‌ప్ప‌కుండా సహకారం ఉంటుందన్నారు.

  • Loading...

More Telugu News