Asia Cup 2025: పురుషుల ఆసియా కప్‌-2025కు భారత్ ఆతిథ్యం

India is set to host the next edition of the Mens Asia Cup in 2025 in the T20 format

  • 1991 తర్వాత తొలిసారి ఇండియా ఆతిథ్యం
  • 2027లో బంగ్లాదేశ్‌లో నిర్వహణ
  • నిర్ధారించిన ఆసియా క్రికెట్ మండలి

దాదాపు 34 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి పురుషుల ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2025 ఆసియా కప్ భారత్ వేదికగా జరగనుంది. ఈ మేరకు ‘ఇన్విటేషన్ ఫర్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్‌’లో ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) నిర్ధారించింది. ఆ మరుసటి ఏడాది 2026లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని సన్నాహకంగా టీ20 ఫార్మాట్‌లో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. 

ఇక 2027 ఆసియా కప్‌కు బంగ్లాదేశ్‌ ఆతిథ్యం ఇవ్వనున్నట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ పేర్కొంది. అయితే 50-ఓవర్ల ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుంది. అదే ఏడాది దక్షిణాఫ్రికా, నమీబియాల సంయుక్త ఆతిథ్యంలో వన్డే వరల్డ్ కప్ జరగనుండడంతో ఈ ఫార్మాట్‌లో ఆడించాలని ఏసీసీ నిర్ణయించింది.

 ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్, భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు టెస్ట్ ఫార్మాట్ క్రికెట్ ఆడని ఒక ఆసియా జట్టుకు కూడా ఆడే అవకాశం కల్పించనున్నట్టు ఏసీసీ పేర్కొంది.

కాగా 1991 తర్వాత ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. దౌత్య సంబంధాల దృష్ట్యా అత్యధిక ఆసియా కప్‌లకు బంగ్లాదేశ్, శ్రీలంక ఆతిథ్యం ఇచ్చాయి. పాకిస్థాన్‌లో కూడా కొన్ని టోర్నీలు జరిగాయి. గతేడాది ఆసియా కప్‌కు దాయాది దేశమే ఆతిథ్యం ఇచ్చింది. అయితే భారత్ జట్టు అక్కడికి వెళ్లేందుకు అభ్యంతరం వ్యక్తం చేయడంతో హైబ్రిడ్ మోడల్‌లో ఇండియా మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించారు.

  • Loading...

More Telugu News