Madanapalle Incident: మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం... వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు
- ఇటీవల మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లు దగ్ధం
- మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కేసు నమోదు
- ఆయన వద్ద రెవెన్యూ ఫైళ్లు ఉన్నాయన్న డీఐజీ
- అందుకే కేసు నమోదు చేశామని వెల్లడి
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఫైళ్ల దగ్ధం ఘటనపై దర్యాప్తు ఊపందుకుంది. ఈ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి మదనపల్లెలోని నవాజ్ బాషా నివాసంలో నిన్న నోటీసులు అందించిన పోలీసులు... ఇవాళ కేసు నమోదు చేశారు. రెవెన్యూ శాఖకు చెందిన ఫైళ్లు నవాజ్ బాషా వద్ద ఉన్నాయని, అందుకే ఆయనపై కేసు నమోదు చేశామని డీఐజీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.
ఈ ఘటనలో ఇప్పటివరకు 8 కేసులు నమోదు చేశామని, ఫోరెన్సిక్ నివేదిక వస్తే, దాన్ని బట్టి మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి నివాసంలో 500 ఫైళ్లు దొరికాయని, పెద్దిరెడ్డి పీఏలు శశిధర్, తుకారాం నివాసాల్లోనూ పలు కీలక ఫైళ్లు లభ్యమయ్యాయని డీఐజీ ప్రవీణ్ కుమార్ వివరించారు. బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే భూ అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.