Nara Lokesh: అకడెమిక్ క్యాలెండర్ ను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్

Nara Lokesh releases academic calendar

  • రాజకీయాలకు అతీతంగా అకడమిక్ క్యాలెండర్ తీసుకువచ్చామని వెల్లడి
  • నాయకుల బొమ్మలు, పార్టీల రంగులు లేకుండా రూపకల్పన చేసినట్టు స్పష్టీకరణ
  • ఆగస్టులో స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల ఎన్నికలకు ఆదేశం
  • కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఏపీలో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకడమిక్ క్యాలెండర్ ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం నాడు విడుదల చేశారు. గతానికి భిన్నంగా ముఖ్యమంత్రి, మంత్రి ఫోటోలు లేకుండా రాజకీయాలకు అతీతంగా స్కూల్ అకడమిక్ క్యాలెండర్ ను రూపొందించినట్టు లోకేశ్ వెల్లడించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ విద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఎటువంటి రాజకీయ జోక్యాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. టీచర్లు, విద్యార్థులకు ఇచ్చే శిక్షణ దీపిక (ట్రైనింగ్ మాన్యువల్) లో సైతం మంత్రి సందేశం, ఫోటోలు, పార్టీ రంగులు ఉండరాదని ఆదేశించారు. 

స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల పదవీకాలం జులైతో పూర్తయినందున ఆగస్టులో మేనేజ్ మెంట్ కమిటీల ఎన్నికలు పూర్తిచేయాలని అన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని లోకేశ్ సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో టాయ్ లెట్ల నిర్వహణ మెరుగుపర్చాలని, ఇందుకు అవసరమైన కెమికల్స్, ఉపకరణాల కొనుగోలుకు తక్షణమే టెండర్లు పిలవాలని ఆదేశించారు. 

సీబీఎస్ఈ స్కూళ్ల పనితీరుపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి లోకేశ్ త్వరలో తదుపరి రూట్ మ్యాప్ ప్రకటిస్తామని చెప్పారు. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయాల్సిందిగా సూచించారు. 

ఈ సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి కోన శశిధర్, డైరక్టర్ విజయరామరాజు, రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరక్టర్ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Nara Lokesh
Academic Calendar
School Education
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News