Revanth Reddy: తెలంగాణ రాకపోయి ఉంటే రేవంత్ రెడ్డి ఇంకా చంద్రబాబుతోనే ఉండేవారు: హరీశ్ రావు

Harish Rao says Revanth Reddy traitor of telangana

  • రేవంత్ పీసీసీ చీఫ్ అయినా... సీఎం ఐనా కేసీఆర్ పుణ్యమేనని వ్యాఖ్య
  • నాడు ఉద్యమకారులపైకి రేవంత్ రెడ్డి రైఫిల్‌తో దాడికి వెళ్లాడని ఆరోపణ
  • కేసీఆర్ తెలంగాణను సాధించడం వల్లే రేవంత్ రెడ్డికి పదవులు వచ్చాయని వ్యాఖ్య

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినా... ముఖ్యమంత్రి అయినా అది కేసీఆర్ పుణ్యమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రకటన వెనక్కిపోతే ఆరోజు తాము రాజీనామా చేశామని, రేవంత్ రెడ్డి కనీసం డూప్లికేట్ రాజీనామా కూడా చేయలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు రాజీనామా చేయలేదనే ఆరోజు బలిదానాలు జరిగాయన్నారు. అమరుల లేఖలు చూస్తే బలిదానాలకు కారణం ఎవరో తెలుస్తుందన్నారు.

కేసీఆర్‌లా రాజీనామాలు చేసిన చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత దీక్షతో తెలంగాణ వచ్చిందన్నారు. 14 ఏళ్ల ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎప్పుడూ తెలంగాణ కోసం పని చేయలేదని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ సాధించకపోతే ఈ రేవంత్ రెడ్డి ఇంకా చంద్రబాబుతో ఉండేవారన్నారు. నాడు ఉద్యమ‌కారుల‌పైకి రైఫిల్‌తో దాడికి వెళ్లాడని ఆరోపించారు. అలాంటి రేవంత్ తెలంగాణ ఛాంపియన్‌ను తానే అని చెప్పుకోవడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. కేసీఆర్ తెలంగాణ సాధించడం వల్లే రేవంత్ రెడ్డికి పదవులు వచ్చాయన్నారు.

జైపాల్ రెడ్డి పెద్ద తెలంగాణవాది అనీ, తాను చిన్న తెలంగాణవాదిననీ అంటూ రేవంత్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం జైపాల్ రెడ్డి ఏ పార్టీనైనా ఒప్పించారా? కానీ కేసీఆర్ 36 పార్టీలను ఒప్పించారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడుతుందని తెలిశాకే రేవంత్ రెడ్డి తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారన్నారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని ముఖ్యమంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.

గతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదన్నారు. మరి ఆ పార్టీ పని అయిపోయిందా? తాము రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే ఆ పార్టీ పని అయిపోయిందా? అని ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికల్లో గతంలో కాంగ్రెస్ 18 రాష్ట్రాల్లో ఖాతా తెరవలేదని... అప్పుడు ఆ పార్టీ పని అయిపోయిందా? ఇండియా కూటమి 28 పార్టీలతో ఏర్పడింది... కాంగ్రెస్ అందులో గెలిచిన సీట్లు 99 అన్నారు. బీఆర్ఎస్ పార్టీకీ మంచి రోజులు వస్తాయని... అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి తప్పుడు రిపోర్టులు చదివారు

మేడిగడ్డ సాధ్యం కాదని రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పినట్లుగా గత మూడు సమావేశాల్లో రేవంత్ రెడ్డి తప్పుడు రిపోర్టులు చదివారని హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వం డిఫెన్స్‌లో పడగానే ఓ కాగితం తెచ్చి చర్చను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మోటార్లకు మీటర్లపై కూడా అబద్దాలు చెప్పారని మండిపడ్డారు.

పోతిరెడ్డిపాడును దగ్గరుండి బొక్క పెట్టించారని ఆరోపిస్తున్నారని... ఉమ్మడి రాష్ట్రంలో తాము రాజీనామా చేసిన తర్వాతనే పోతిరెడ్డిపాడుకు జీవో విడుదలైందని తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు, నక్సలైట్లతో చర్చలు, తెలంగాణ ప్రయోజనాల కోసం ఆనాడు 2005లో మంత్రి పదవులను వదులుకున్నామన్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ ఎల్‌ఆర్‌ఎస్ ఉచితంగానే చేయాలని గతంలో కోర్టులో కేసు వేశారని... కానీ ఇప్పుడేమో డబ్బులు వసూలు చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని హరీశ్ రావు అన్నారు. ఈ ధరలను ఏకంగా రూ.14 వేల నుంచి రూ.18 వేలకు పెంచి వసూలు చేద్దామని భావిస్తున్నారన్నారు.

  • Loading...

More Telugu News