PM Awas Yojana Urban: పీఎం ఆవాస్‌ యోజన-పట్టణ పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు

4 lakhs for house construction under PM Awas Yojana Urban central govt Issue of guidelines

  • కేంద్రం వాటా 2.5 లక్షలు.. రాష్ట్ర ప్రభుత్వాల వాటా రూ.1.5 లక్షలు
  • అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా ఇవ్వాల్సిందేనన్న కేంద్రం
  • మార్గదర్శకాలను సవరించిన కేంద్రం
  • త్వరలోనే కేబినెట్ ఆమోదం తెలిపే సూచనలు
  • సోమవారం జరగనున్న గృహ నిర్మాణరంగంపై సమీక్షలో సీఎం చంద్రబాబుకు నివేదించనున్న అధికారులు

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ) 2.0 పథకం కింద కొత్తగా ఎంపికైన లబ్దిదారులు ఇకపై ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల మొత్తాన్ని పొందనున్నారు. కేంద్రం రూ.2.50 లక్షలు అందించనుండగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా కచ్చితంగా మరో రూ.1.50 లక్షలు ఇవ్వాలని మోదీ సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు 2024-25 కాలంలో అమలు కానున్న ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ) 2.0 పథకం మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి తమ వాటా నిధుల్ని కేటాయించాల్సిందేనని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను ఎన్నికల ముందే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ పంపింది.

పేదల ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణంలో జాప్యాన్ని పరిశీలించేందుకు ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం తన ప్రతినిధుల బృందాన్ని పరిశీలనకు పంపించింది. నివేదికను అందుకున్న అనంతరం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ) 2.0 పథకం మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. సాంకేతికతను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు కేంద్రం అదనపు సహకారం కూడా అందించనుంది.

సవరించిన మార్గదర్శకాలకే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపే సూచనలు ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. గృహనిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (సోమవారం) నిర్వహించనున్న సమీక్షలో అధికారులు ఇదే విషయాన్ని చెప్పనున్నారని తెలుస్తోంది.

3 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యం..
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ) 2.0 పథకం కింద 2024-25 కాలంలో దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇళ్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో నివసిందే పేదలకు ఈ పథకం వర్తిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే మొత్తం 23 పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్నాయి. ఈ పథకానికి అర్హులయ్యేవారు ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షల నగదుతో పాటు ఉపాధి హామీ పథకం కింద అదనంగా రూ.30 వేల మొత్తం అందనుంది. కాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌లో సక్రమంగా అమలు చేయలేదని కేంద్రం విమర్శించిన విషయం తెలిసిందే.

More Telugu News