Tamil Rockers: 'తమిళ్‌ రాకర్స్‌‌'కు షాక్.. అత్యంత చాకచక్యంగా అడ్మిన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు

A Malayalam movie piracy led to arrest Tamil Rockers admin Stephen Raj

  • ‘రాయన్’ సినిమాను సెల్‌ఫోన్‌తో రికార్డు చేస్తుండగా పట్టుకున్న కొచ్చి సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు
  • ఓ మలయాళం సినిమా పైరసీ కేసులో స్టీఫెన్ రాజ్‌‌పై కేసు నమోదు
  • అత్యంత చాకచక్యంగా దర్యాప్తు.. అరెస్ట్

కొత్త కొత్త సినిమాలు, కొన్ని విడుదల కాకముందే పైరసీ చేసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసే ‘తమిళ్ రాకర్స్’కు కేరళ పోలీసులు షాకిచ్చారు. తమిళ్ రాకర్స్ గ్రూపు అడ్మిన్ స్టీఫెన్ రాజ్‌ను చాకచక్యంగా అరెస్టు చేశారు. కేరళలోని తిరువనంతపురంలోని ఓ థియేటర్‌లో ధనుష్‌ నటించిన ‘రాయన్‌’ సినిమాను సెల్‌ఫోన్‌లో రికార్డు చేస్తుండగా ఆదివారం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ నటించిన ‘గురువాయూర్‌ అంబలనడైయిల్‌’ అనే మలయాళ సినిమా విడుదలైన రోజునే పైరసీ అయ్యింది. వెబ్‌సైట్‌తో పాటు టెలిగ్రామ్ గ్రూపుల్లో ఈ సినిమా చక్కర్లు కొట్టింది. దీంతో సినిమా నిర్మాతల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. 

ఆ సినిమా ఏ థియేటర్‌లో రికార్డు అయ్యిందో తెలుసుకునేందుకు ఎండ్ టు ఎండ్ డిజిటల్ సినిమా టెక్నాలజీ, సొల్యూషన్ అందించే ‘క్యూబ్ డిజిట్‌’ను సంప్రదించారు. వారు అందించిన సమాచారంతో తిరువనంతపురంలోని ఓ థియేటర్‌లో సినిమాను పైరసీ చేసినట్టు గుర్తించారు. అయితే ఆ థియేటర్ లోపల సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎవరు రికార్డు చేశారో గుర్తించలేకపోయారు. దీంతో పైరసీ వీడియో రికార్డయిన యాంగిల్ (కోణం) ఆధారంగా ఏ సీటు నుంచి చిత్రీకరించారో పోలీసులు కచ్చితంగా గుర్తించారు. ఆ సీటులో సినిమా విడుదల రోజు కూర్చున్న వ్యక్తి మొబైల్ ఫోన్ నంబర్‌ను కూడా ట్రేస్ చేశారు.

ఆటకట్టించారిలా..
ఫోన్ నంబర్ వివరాలు తెలిసినప్పటికీ పోలీసులు వెంటనే రంగంలోకి దిగలేదు. చాలా అప్రమత్తంగా వ్యవహరించారు. నిందిత వ్యక్తి ఫోన్ నంబర్‌తో సినిమా టికెట్లు బుక్ అయినప్పుడు తమకు సమాచారం అందించాలని థియేటర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఇటీవల ధనుష్ నటించిన రాయన్ సినిమాకు అదే సీటుతో పాటు పక్క సీటును అదే ఫోన్ నంబర్‌తో బుక్ చేసుకున్న విషయాన్ని గుర్తించిన థియేటర్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. 

తర్వాత థియేటర్‌కు వచ్చిన నిందితుడు తన సెల్‌ఫోన్‌లో సినిమాను చిత్రీకరించడం మొదలుపెట్టాడు. దీంతో అతడిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చాలా కాలంగా సినిమాలు రికార్డింగ్ చేస్తున్నట్టు అతడు అంగీకరించాడని కేరళ పోలీసులు తెలిపారు. ఈ మేరకు కొచ్చి సైబర్‌ క్రైం పోలీసులు వివరాలు వెల్లడించారు. స్టీఫెన్‌ రాజ్‌ను 5 రోజుల కస్టడీకి తీసుకున్నామని, కేసును దర్యాప్తు చేస్తున్నామని వారు తెలిపారు. నిందితుడు తమిళనాడులోని మధురైకి చెందినవాడని వివరించారు.

  • Loading...

More Telugu News