Centralised Kitchen: సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో 28 వేల మంది విద్యార్థులకు ఆహారం అందించే భారీ వంటశాల

Huge kitchen will be established in CM Revanth Reddy constituency Kodangal

  • నేడు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు
  • కొడంగల్ లో సెమీ రెసిడెన్షియల్ స్కూలు ఏర్పాటుపై చర్చ
  • ఇప్పటికే ప్రారంభమైన భారీ వంటశాల పనులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ వంటశాల ఏర్పాటు చేసేందుకు హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ మెగా వంటశాల ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని 28 వేల మంది పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించనున్నారు. 

ఇవాళ హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డిని హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ లో పైలట్ ప్రాజెక్టుగా ఓ సెమీ రెసిడెన్షియల్ స్కూలు స్థాపించడంపై రేవంత్ రెడ్డితో చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు చర్చలు జరిపారు. 

దీనిపై సీఎంవో వర్గాలు స్పందించాయి. భారీ వంటశాలకు సంబంధించిన నిర్మాణాలు ఇప్పటికే కొడంగల్ లో మొదలయ్యాయని వెల్లడించాయి. కాగా, ఈ భారీ వంటశాలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ సాయంతో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ నిర్వహించనుంది. 

ఈ వంటశాల పూర్తయ్యాక కొడంగల్ లో సెమీ రెసిడెన్షియల్ స్కూలు కూడా ప్రారంభించనున్నారని సీఎంవో వర్గాలు వివరించాయి.

More Telugu News