Bandi Sanjay: అక్బరుద్దీన్‌కు దమ్ముంటే కొడంగల్ బరిలో నిలవాలి.. బండి సంజయ్ సవాల్
- ఎంఐఎం గోడ మీద పిల్లిలాంటి పార్టీ అంటూ బండి సంజయ్ ఫైర్
- ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరుతారని ఎద్దేవా
- కొడంగల్ నుంచి పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కనివ్వబోమని హెచ్చరిక
మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి ఏమాత్రం దమ్మున్నా వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేయాలని బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ సవాలు విసిరారు. వచ్చే ఎన్నికల్లో అక్బరుద్దీన్‌ను కొడంగల్ నుంచి బరిలోకి దింపి గెలిపించి డిప్యూటీ సీఎం పదవి ఇస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు బండి ఇలా స్పందించారు. ఆ స్థానం నుంచి ఆయనను బరిలోకి దింపితే డిపాజిట్ కూడా దక్కనివ్వబోమని హెచ్చరించారు. ఎంఐఎం గోడ మీద పిల్లిలాంటి పార్టీ అని, ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరడం ఆ పార్టీకి అలవాటేనని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో బోనాల పండుగకు ప్రభుత్వం రూ. 5 లక్షలు మాత్రమే ఇస్తే, రంజాన్ పండుగకు రూ. 33 కోట్లు ఇచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తామని చెప్పారు.