YS Sharmila: అసెంబ్లీకి పోనప్పుడు ఆఫ్రికా అడవులకు వెళ్తే ఏంటి? అంటార్కిటికా మంచులోకి వెళ్తే ఏంటి?: జగన్‌పై షర్మిల ఫైర్

YS Sharmila fires on YS Jagan

  • జగన్ మాటలు ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్న షర్మిల
  • ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించింది ప్యాలెస్‌లో ప్రెస్‌మీట్లు పెట్టేందుకు కాదని ఆగ్రహం
  • ప్రతిపక్ష హోదాకే కాదు.. ఎమ్మెల్యే హోదాకు కూడా జగన్ అర్హులు కాదన్న ఏపీ కాంగ్రెస్ చీఫ్

ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతానని జగన్ అనడం ఆయన అజ్ఞానానికి నిదర్శమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇంతకుమించిన పిరికితనం, చేతకానితనం, అహంకారం ఎక్కడా కనిపించదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి గెలిపించి, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లిందని ధ్వజమెత్తారు. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడం దివాలాకోరుతనమని మండిపడ్డారు.

ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని, మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ కాదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా గెలిచింది చట్ట సభల్లో ప్రజల గొంతుక అవడానికా? లేదంటే మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోడానికా? అని షర్మిల ప్రశ్నించారు. ఐదేళ్ల పాలనలో అవినీతి, దోపిడీ తప్ప ఇంకేం లేదని, అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే తాపీగా ప్యాలెస్‌లో కూర్చుని మీడియా మీట్‌లు పెట్టేందుకు ప్రజలు మిమ్మల్ని గెలిపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అసెంబ్లీకి పోనని చెప్పే జగన్ ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కాదని, వెంటనే రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు ఆఫ్రికా అడవుల్లోకి వెళ్తే ఏంటి? అంటార్కిటికా మంచులోకి వెళ్తే ఏంటని జగన్‌పై షర్మిల ఫైరయ్యారు.

More Telugu News