Documented Dreamers: అమెరికాలో దేశబహిష్కరణ ముప్పు.. ప్రమాదంలో లక్షలాది మంది భారతీయులు!

Why Are Children Of Indian Americans Facing Deportation Risk

  • తల్లిదండ్రులతో చిన్నతనంలో యూఎస్ఏ వెళ్లిన యువతీయువకులకు దేశబహిష్కరణ ప్రమాదం
  • 21 ఏళ్లు నిండినా గ్రీన్ కార్డు రాకపోవడంతో భారత్‌కు తిరిగి రావాల్సిన దుస్థితి 
  • సమస్య పరిష్కారానికి రిపబ్లికన్‌లు అడ్డుపడుతున్నారంటూ బైడెన్ ప్రభుత్వం గుస్సా

చిన్నతనంలోనే తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లిన లక్షలాది మంది భారతీయుల యువతీయువకులు ప్రస్తుతం దేశబహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఎదుర్కొంటున్నారు. శాశ్వత నివాసార్హత, లేదా తాత్కాలిక వీసాలు రాక స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అమెరికాలో ఇలాంటి వారిని డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌గా పిలుస్తారు. వీరి మొత్తం సంఖ్య 2.5 లక్షలకు పైనే ఉంటుంది. డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌లో భారతీయులే అత్యధికమని స్వయంగా వైట్ వర్గాలు తెలిపాయి. 

అమెరికా నిబంధనల ప్రకారం, తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వచ్చే చిన్నారులను వీసాదారులపై ఆధారపడ్డ వారిగా పరిగణిస్తారు. 21 ఏళ్ల వరకూ వారు దేశంలో ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఆలోపు గ్రీన్ కార్డు దక్కితే చట్టబద్ధంగా అగ్రరాజ్యంలో కొనసాగవచ్చు. లేకపోతే, వయసు మీరిందంటూ వారిని గ్రీన్ కార్డు జాబితా నుంచి తొలగిస్తారు. దీన్ని ‘ఏజ్ ఔట్‌’గా పిలుస్తారు. ఆ తరువాత గ్రీన్ కార్డు లేదా వీసా కోసం సొంతంగా ప్రయత్నించాలి. ఇందులో విఫలమైతే స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలి. అమెరికాలో ప్రస్తుతం భారతీయులు వారి పిల్లలు సహా మొత్తం1.2 మిలియన్ల మంది వివిధ కేటగిరిల్లో దరఖాస్తు చేసుకుని గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు, కొందరు భారత సంతతి యువతీయువకులు ఇప్పటికే అమెరికాలోని తమ కుటుంబాలను వీడి భారత్‌లో బంధువుల వద్ద తలదాచుకుంటున్నారు. 

డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌ సమస్య పరిష్కారానికి రిపబ్లికన్స్ చట్టసభల్లో మోకాలు అడ్డుతున్నారని వైట్ హౌస్ ఆరోపించింది. అన్ని వర్గాలకు అనుకూలమైన ఒప్పందాన్ని తాము రూపొందిస్తే రిపబ్లికన్లు రెండు సార్లు వ్యతిరేకంగా ఓటు వేశారని గుర్తు చేశారు. కాగా, గత నెలలో వివిధ పార్టీలకు చెందిన 43 మంది చట్టసభ సభ్యులు.. ఈ సమస్యకు పరిష్కారం కోరుతూ బైడెన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. గ్రీన్ కార్డుల కోసం కొందరు దశాబ్దాల తరబడి వేచి చూస్తున్నారని, సమస్యకు తక్షణ పరిష్కారం కోసం ప్రయత్నించాలని సూచించారు.

  • Loading...

More Telugu News