Free Bus Service: పొరుగు రాష్ట్రాల్లో ‘ఉచిత బస్సు ప్రయాణం’పై ఏపీ అధ్యయనం.. సీఏం ముందుకు రిపోర్టు

AP officials report of free bus service in Telangana and Karnataka

  • కర్ణాటక, తెలంగాణలో పథకం అమలుపై ఏపీ అధికారుల అధ్యయనం
  • రాబడిపోబడులు, ప్రయాణికుల సంఖ్యలో పెరుగుదలపై పరిశీలన
  • పథకం అమలుకు ఏపీ ఆర్టీసీపై నెలకు రూ.250 కోట్ల భారం పడుతుందని అంచనా
  • సోమవారం సీఎం నేతృత్వంలో జరగనున్న సమావేశంలో అధ్యయనంపై చర్చ

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై అక్కడి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ, కర్ణాటకలో పథకం అమలుపై అధ్యయనం చేశారు. అక్కడి ఆర్టీసీల రాబడిపోబడి తదితరాలను అధ్యయనం చేసిన అధికారులు సవివరమైన నివేదికను రూపొందించారు. ఏపీలో పథకం అమలుకు ఆర్టీసీపై నెలనెలా రూ.250 కోట్ల భారం పడుతుందని తేల్చారు. సోమవారం ఏపీ సీఎం చంద్రబాబు ఆర్టీసీ, రవాణా శాఖలపై  నిర్వహించనున్న సమావేశంలో ఈ నివేదిక చర్చకు రానుంది. 

పొరుగు రాష్ట్రాల్లో పథకం అమలు ఇలా..
  • తెలంగాణలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు, హైదరాబాద్‌లోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇక కర్ణాటకలోని గ్రామీణ బస్సు సర్వీసులు, బెంగళూరులోని సిటీ సర్వీసుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. ఇందుకు భిన్నంగా తమిళనాడు రాజధాని చెన్నై, కోయంబత్తూర్ నగరాల్లో మాత్రం కేవలం సిటీ బస్సుల్లోనే ఉచిత ప్రయాణం పథకం అమలవుతోంది. 
  • పథకంలో భాగంగా తెలంగాణ, కర్ణాటకలో జీరో టిక్కెట్ జారీ అవుతుంది. టిక్కెట్‌పై చార్జీ సున్నా అని ఉన్నా యంత్రంలో మాత్రం ఈ ధర నమోదు అవుతుంది. ఈ జీరో టిక్కెట్ల మొత్తం విలువను ఆర్టీసీ అధికారులు లెక్కకట్టి రీయింబర్స్‌మెంట్‌ కోసం ప్రభుత్వం ముందుంచుతున్నారు. 
  • పొరుగు రాష్ట్రాల్లో పథకం అమలు ప్రారంభమయ్యాక బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 65 - 70 శాతం నుంచి 95 శాతానికి పెరిగింది. 
  • పొరుగు రాష్ట్రాల్లో లాగా ఏపీలో కూడా గ్రామీణ సర్వీసులు, నగరాల్లోని ఆర్డినరీ, మెట్రో సర్వీసుల్లో ఈ పథకం అమలు చేసే అవకాశం ఉంది. పథకం అమలు తరువాత ఇక్కడ కూడా ఆక్యుపెన్సీ రేషియో 95 శాతానికి చేరుతుందని అధికారులు అంచనా వేశారు. 
  • ప్రస్తుతం ఏపీఎస్ఆర్‌టీసీలో నిత్యం సగటున 36 నుంచి 37 లక్షల మంది ప్రయాణిస్తుండగా వీరిలో మహిళ సంఖ్య సుమారు 15 లక్షలు.

అధికారుల లెక్కల ప్రకారం, ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం పథకం తరువాత ఆర్టీసీకి టిక్కెట్ల రూపంలో వచ్చే రాబడి, స్టూడెంట్, ఇతర పాస్‌ల నుంచి రాబడి తగ్గుతుంది. ప్రస్తుతం టిక్కెట్ల ద్వారా ఆదాయం రూ.500 కోట్లు. ఇందులో రూ. 220 కోట్లు ఇంధనంపై వెచ్చిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలకు గాను ప్రభుత్వం నెలకు సగటున రూ.125 కోట్లు ఆర్టీసీ చెల్లిస్తోంది. ఉచిత పథకం అమలు తరువాత ప్రభుత్వం ఆర్టీసీ నుంచి నెలనెలా 25 శాతం సొమ్మును తీసుకోకుండా ఉండాలి. దీనికి అదనంగా మరో రూ.125 కోట్లు రీయింబర్సు చేయాలి. ఇలా అన్నీ అంశాలు పరిగణనలోకి తీసుకుంటే ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ఆర్టీసీపై నెలకు రూ.250 కోట్ల భారం పడే అవకాశం ఉందని అధికారులు లెక్కకట్టారు. సోమవారం జరగనున్న సమావేశంలో ఈ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News