Team India: ఓటమి కోరల్లోంచి గెలుపు బాటలోకి... శ్రీలంకపై టీమిండియా అద్భుత విజయం

Team India beat host Sri Lanka by 43 runs in 1st T20

  • టీమిండియా-శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్
  • 43 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ
  • తొలుత 20 ఓవర్లలో 213 పరుగులు చేసిన టీమిండియా
  • లక్ష్యఛేదనలో శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్

శ్రీలంకతో టీ20 సిరీస్ లో టీమిండియా గెలుపుతో బోణీ కొట్టింది. పల్లెకెలెలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 43 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను ఓడించింది. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగులు చేసింది. 214 పరుగుల భారీ లక్ష్యఛేదనను శ్రీలంక ఆరంభించిన తీరు చూస్తే... ఆ జట్టు గెలుపుపై ఎవరికీ సందేహాలు కలగవు. ఆ జట్టు స్కోరు 8 ఓవర్లకే 80 పరుగులు దాటింది. ఓపెనర్లు పత్తుమ్ నిస్సాంక 79, కుశాల్ మెండిస్ 45 పరుగులతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. 

ఆ తర్వాత కూడా 14 ఓవర్లలో 140 పరుగులు చేసి విజయం దిశగా దూసుకుపోతున్నట్టు కనిపించింది. కానీ, టీమిండియా బౌలర్లు కీలక సమయంలో రాణించడంతో శ్రీలంక అక్కడ్నించి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. చివరికి 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌట్ అయింది. 

కెప్టెన్ చరిత్ అసలంక (0), మాజీ కెప్టెన్ దసున్ షనక (0) డకౌట్ కావడంతో లంక విజయావకాశాలను ప్రభావితం చేసింది. కుశాల్ పెరీరా 20, కమిందు మెండిస్ 12 పరుగులు చేశారు. మిగతా అంతా సింగిల్ డిజిట్ కే పరిమితయ్యారు. టీమిండియా బౌలర్లలో పార్ట్ టైమ్ బౌలర్ రియాన్ పరాగ్ 3 వికెట్లు పడగొట్టడం విశేషం. అర్షదీప్ సింగ్ 2, అక్షర్ పటేల్ 2, మహ్మద్ సిరాజ్ 1, రవి బిష్ణోయ్ 1 వికెట్ తీశారు. 

ఈ విజయంతో టీమిండియా 3 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ రేపు (జులై 28) ఇదే మైదానంలో జరగనుంది. కాగా, టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ కూడా విజయంతో ప్రస్థానం ఆరంభించినట్టయింది.

  • Loading...

More Telugu News