Team India: టీమిండియా టాపార్డర్ వీరవిహారం... లంక ముందు భారీ టార్గెట్

Team India top order hammers Sri Lanka bowlers

  • టీమిండియా-శ్రీలంక మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్
  • నేడు పల్లెకెలెలో తొలి మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 213 పరుగులు చేసిన టీమిండియా

టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ నేడు ప్రారంభమైంది. తొలి మ్యాచ్ కు పల్లెకెలె ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు బౌలింగ్ ఎంచుకోగా, టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. టాపార్డర్ విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. 

ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్ మాన్ గిల్ తొలి వికెట్ కు 6 ఓవర్లలోనే 74 పరుగులు జోడించి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. యువ ఆటగాడు జైస్వాల్ 21 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 40 పరుగులు చేయగా... గిల్ 16 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సుతో 34 పరుగులు చేశాడు. గిల్, జైస్వాల్ 74 పరుగుల స్కోరు వద్దే వెనుదిరిగారు. 

ఈ దశలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ జోడీ కూడా దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు తీయించింది. సూర్యకుమార్ 26 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సులతో 58 పరుగులు చేశాడు. పంత్ కూడా ధాటిగా ఆడుతూ 33 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సుతో 49 పరుగులు చేశాడు. 

అయితే మిడిల్ ఓవర్లలో లంక పేసర్ మతీశ పతిరణ టీమిండియాను దెబ్బతీశాడు. పతిరణ పరుగులు బాగానే ఇచ్చుకున్నప్పటికీ 4 వికెట్లు తీశాడు. సూర్యకుమార్, పంత్, హార్దిక్ పాండ్యా (9), రియాన్ పరాగ్ (7) పతిరణ బౌలింగ్ లోనే అవుటయ్యారు. 

ఇక, ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన హార్డ్ హిట్టర్ రింకూ సింగ్ కేవలం ఒక్క పరుగుకే అవుటై నిరాశపరిచాడు. శ్రీలంక బౌలర్లలో పతిరణ 4, దిల్షాన్ మధుశంక 1, అసితా ఫెర్నాండో 1, వనిందు హసరంగ 1 వికెట్ తీశారు.

More Telugu News