Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకానికి చిగురించిన ఆశలు
- 10 మీటర్ల ఉమెన్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఫైనల్ చేరిన మను భాకర్
- 580 స్కోరులో మూడో స్థానంలో నిలిచిన భారత షూటర్
- రేపే ఫైనల్ రౌండ్... చరిత్ర సృష్టించాలని భావిస్తున్న మను భాకర్
అంగరంగ వైభవంగా ప్రారంభమైన పారిస్ ఒలింపిక్స్-2024లో భారత అథ్లెట్లు పతకాల వేట మొదలుపెట్టారు. తొలి రోజు పతకాలకు గ్యారంటీ లేకపోయినప్పటికీ పలువురు అథ్లెట్లు సత్తాచాటారు. ముఖ్యంగా 10 మీటర్ల ఉమెన్స్ ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్ లో అదరగొట్టిన మను భాకర్ ఫైనల్లో అడుగుపెట్టింది.
శనివారం జరిగిన వేర్వేరు ఈవెంట్లలో భారత్‌కు చెందిన ఇతర షూటర్లు నిరాశ పరిచినప్పటికీ మను భాకర్ మెరిసింది. సత్తా చాటి ఫైనల్ చేరింది. హంగేరి క్రీడాకారిణి వెరోనికా మేజర్ 582 స్కోర్‌తో అగ్రస్థానంలో నిలవగా.. 580 స్కోరుతో మను భాకర్ మూడవ స్థానంలో నిలిచింది. భారత్‌కు చెందిన ఇతర షూటర్లలో రిథమ్ సాంగ్వాన్ 573 స్కోర్‌తో 15వ స్థానంలో నిలిచింది. కాగా ఫైనల్ రౌండ్ రేపు (ఆదివారం) జరగనుంది.
10 మీటర్ల ఉమెన్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ ఫైనల్ చేరడంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం ఆశ చిగురించినట్టయింది. ఒలింపిక్ పతకాన్ని సాధించాలని భాకర్ గట్టి పట్టుదలతో ఉంది. మరి ఫలితం ఎలా ఉండబోతోందనేది రేపు తేలనుంది.