Ponnam Prabhakar: హైదరాబాద్‌కు రూ.10 వేల కోట్లిచ్చాం... కిషన్ రెడ్డి ఏం తెచ్చారో చెప్పాలి: పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar question kishan reddy over funds to Hyderabad

  • హైదరాబాద్ నగరానిక స్మార్ట్ సిటీ నిధులు తీసుకు రావాలన్న మంత్రి
  • కేంద్రం నిధులు ఇవ్వలేదంటే... బీజేపీ వాళ్లు మా దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారని ఆగ్రహం
  • రైతాంగాన్ని కాపాడే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందని హామీ

హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర బడ్జెట్‍‌‌లో రూ.10 వేల కోట్లు కేటాయించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నగర అభివృద్ధికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భాగ్యనగరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారని, కానీ ఒక్క రూపాయి తీసుకురాలేదని మండిపడ్డారు.

గతంలో స్మార్ట్ సిటీ వస్తే కరీంనగర్‌కు ఇచ్చారని, ఇప్పుడు హైదరాబాద్ నగరానికి స్మార్ట్ సిటీ నిధులు తీసుకు రావాలన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని నిలదీశారు. కేంద్రం నిధులు ఇవ్వలేదని చెబుతుంటే బీజేపీ వాళ్ళు మా దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే ఎల్లంపల్లి పూర్తయిందన్నారు. 

తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టకపోవడంతో మనకు నష్టం జరిగిందన్నారు. బీఆర్ఎస్ నేతలు నిన్న విహారయాత్రకు వెళ్లినట్లుగా కాళేశ్వరం వెళ్లారన్నారు. రాష్ట్ర రైతాంగాన్ని కాపాడే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కిషన్ రెడ్డి అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకవెళ్తామంటే తాము సిద్ధమన్నారు. హైదరాబాద్ నగరానికి కేంద్రం ఏం ఇస్తుందో చెప్పాలన్నారు. బీసీ రిజర్వేషన్లకు ఇబ్బందులు లేకుండానే గ్రామపంచాయతీ ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, అందుకు నిరసనగా నీతి అయోగ్ సమావేశానికి హాజరు కావడం లేదన్నారు.

  • Loading...

More Telugu News