9 to 5 Jobs Death: మరో పదేళ్లలో 9 - 5 పనివేళల జాబ్స్ కనుమరుగు.. లింక్డ్‌ఇన్ సహవ్యవస్థాపకుడి జోస్యం

LinkedIn Co Founder Reid Hoffman Predicts Death Of 9 to 5 Jobs By 2034

  • 2034 కల్లా ఏఐతో ఉద్యోగాల తీరుతెన్నులు మారిపోతాయన్న రీడ్ హాఫ్‌మన్
  • గిగ్ ఎకానమీ విస్తరించి ఫ్రీలాన్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెరుగుతాయని అంచనా
  • ఇప్పటికే హాఫ్‌మన్ చెప్పిన పలు జోస్యాలు నిజమయ్యాయన్న నెటిజన్లు
  • తాజా హెచ్చరికలపై దృష్టిసారించాలని సూచన

కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావంతో 2034 కల్లా సంప్రదాయక పనివేళలు (ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకూ) గల ఉద్యోగాలు కనుమరుగవుతాయని ప్రముఖ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాం లింక్డ్‌ఇన్‌ సహ వ్యవస్థాపకుడు రీడ్ హాఫ్‌మెన్ జోస్యం చెప్పారు. ఏఐ కారణంగా గిగ్ ఎకానమీ విస్తరిస్తుందని, శాశ్వత ఉద్యోగమనే భావన తొలగిపోతుందని చెప్పారు. ప్రజలు ఒకేసారి వివిధ సంస్థలతో కాంట్రాక్ట్ కుదుర్చుకుని పనిచేసే సంప్రదాయం వేళ్లూనుకుంటుందని అంచనా వేశారు. 

మరోవైపు, రీడ్ ‌హాఫ్‌మెన్ వ్యాఖ్యలను నెట్టింట పంచుకున్న ఎంటర్‌ప్రెన్యూరు నీల్ టపారియా భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో హాఫ్‌మెన్ జోస్యాలన్నీ నిజమయ్యాయని గుర్తుచేశారు. 1997లోనే హాఫ్‌మెన్ సోషల్ మీడియా ఆధిపత్యాన్ని ఊహించారని, ఎయిర్‌ బీఎన్‌బీ లాంటి షేరింగ్ సర్వీసులు పెరుగుతాయని అంచనా వేశారని చెప్పారు. చాట్‌జీపీటీ ఉనికి లోకి రాకముందే ఏఐ విప్లవం గురించి హాఫ్‌మెన్ పేర్కొన్నట్టు తెలిపారు. ఆయన తాజా అంచనాలు కూడా నిజమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. 

మార్కెట్లో చాట్‌జీపీటీ కాలుపెట్టిన స్వల్ప వ్యవధిలోనే వేగంగా విస్తరించిందని, ప్రపంచవ్యాప్తంగా లక్షల కొద్దీ ఉద్యోగాలు నిరుపయోగంగా మారిపోయాయని టపారియా అన్నారు. ఇది ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. అయితే, రాబోయే రోజుల్లో శాశ్వత ఉద్యోగుల కంటే ఫ్రీలాన్సర్లే అధికంగా ఆర్జిస్తారని అంచనా వేశారు. రెజ్యూమేలు, సీవీలు వంటి సంప్రదాయక జాబ్ అప్లికేషన్లను ఎవరూ ఉపయోగించరని చెప్పారు. మరోవైపు, హాఫ్‌మన్‌తో పాటు గతంలో వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు.. విచ్ఛిన్నకర ఏఐ ప్రభావాల గురించి హెచ్చరించారు. గిగ్ ఎకానమీతో ఉద్యోగులకు మరింత స్వేచ్ఛ లభించినా ఉద్యోగ భద్రత తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News