Nirmala Sitharaman: ఆ విషయంలో రాష్ట్రాలన్నీ కలిసి రావాలి: నిర్మలా సీతారామన్

States Need To Agree On Inclusion Of Petrol In GST

  • పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్రం సిద్ధమన్న ఆర్థికమంత్రి
  • ఆదాయం కోల్పోతామనే భయంతో రాష్ట్రాలు అంగీకరించడం లేదన్న నిర్మలమ్మ
  • బడ్జెట్‌లో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగలేదని వివరణ

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇంధనం వస్తు సేవల పన్ను కింద ఉంది. అయితే పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే రాష్ట్రాలు ఈ విషయంలో కలిసి వస్తే జీఎస్టీ కిందకు వస్తుందని, అప్పుడు వాటి ధరలు తగ్గుతాయన్నారు. రాష్ట్రాలు జీఎస్టీ కౌన్సిల్‌లో ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుందన్నారు.

ధరను ఫిక్స్ చేసి, అందరూ కలిసి పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చాలని నిర్ణయించుకుంటే తాము దానిని వెంటనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలో చేర్చేందుకు అవసరమైన నిబంధనలను ఇప్పటికే రూపొందించామన్నారు. జీఎస్టీ కౌన్సిల్ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే రాష్ట్రాలు ఆదాయం కోల్పోయే పరిస్థితులు ఉంటాయని, అందుకే రాష్ట్రాలు ఇందుకు సుముఖత చూపడం లేదన్నారు. కానీ మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు జీఎస్టీ ఒక పరిష్కారంగా కనిపిస్తోందని నిర్మలమ్మ అన్నారు. ఎందుకంటే ఇది పన్ను మీద పన్ను భారం లేకుండా చూస్తుందన్నారు.

ఏ రాష్ట్రానికి అన్యాయం జరగలేదు

కేంద్ర బడ్జెట్‌లో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగలేదని నిర్మలా సీతారామన్ చెప్పారు. బీజేపీ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న ఏపీ, బీహార్‌లను మాత్రమే బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తావించారని విపక్షాల విమర్శలను ఆమె తోసిపుచ్చారు.

2014లో రాష్ట్ర విభజన జరిగిన క్రమంలో ఏపీకి విభజన చట్టం ప్రకారం సాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో మాదిరే రాష్ట్రాలకు కేటాయింపులు జరిగాయని, ఏ ఒక్క రాష్ట్రానికీ నిధులను నిరాకరించలేదన్నారు. ఏపీ పునర్వ్యవస్ధీకరణ చట్టం ప్రకారం ఏపీ నూతన రాజధాని నిర్మాణంతో పాటు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సాయం చేయాల్సి ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News