Payyavula Keshav: సింగిల్ కెమెరాతో మీడియా సమావేశం ఏంటి జగన్ గారూ!: మంత్రి పయ్యావుల వ్యంగ్యం

Payyavula counters Jagan remarks

  • ఇవాళ ఆర్థికశాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
  • అదే సమయంలో తాడేపల్లిలో జగన్ ప్రెస్ మీట్
  • జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన పయ్యావుల

వైసీపీ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల అప్పు చేసిందంటూ కూటమి నేతలు ఎన్నికల వేళ దుష్ప్రచారం చేశారని మాజీ సీఎం జగన్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. కానీ గవర్నర్ ప్రసంగంలో మాత్రం ఆ సంఖ్యను రూ.10 లక్షల కోట్లకు తగ్గించారని మండిపడ్డారు. ఇక, ప్రెస్ మీట్ లో జగన్ చెప్పాల్సింది చెప్పాక... ఓ మీడియా ప్రతినిధి రాష్ట్రంలో 36 హత్యలు జరిగాయంటున్నారు కదా.. వాటి వివరాలు చెబుతారా అని జగన్ ను ప్రశ్నించారు. అందుకు జగన్ భోజనానికి టైమైంది అంటూ వెళ్లిపోయారు. 

ఈ నేపథ్యంలో, జగన్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ కు ఇప్పట్లో విపక్ష నేత హోదా వచ్చే అవకాశం లేదని, అందుకు కనీసం పదేళ్లయినా పడుతుందని ఎద్దేవా చేశారు. ప్రజలు మీకు కనీసం 11 సీట్లయినా ఇచ్చారు... ప్రజా తీర్పును గౌరవించి అసెంబ్లీకి రాకుండా సింగిల్ కెమెరాతో మీడియా సమావేశాలు పెడతారా? అందుకేనా మీకు ప్రజలు 11 సీట్లు ఇచ్చింది? అని పయ్యావుల వ్యంగ్యం ప్రదర్శించారు. 

అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర చేపట్టలేనంటూ చేతులెత్తేసి వెళ్లిపోయిన జగన్... ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు మాత్రం వెళతారని ఎద్దేవా చేశారు. జగన్ తీరు మార్చుకోకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి మిగిలరని స్పష్టం చేశారు. 

"రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? మీరు సభలోకి వస్తే ఇవన్నీ వివరిస్తాం కదా. మీ హయాంలో మీరు చేసినవి చాలా విషయాలు అర్థం కాకుండా చెబుతున్నారు కదా... ఆ విషయాలన్నీ మేం కూడా తెలుసుకునేవాళ్లం కదా. తెలియని విషయాలు నేర్చుకోవడానికి మేం సిగ్గుపడం. ఇకనుంచైనా మీరు (జగన్) శాసనసభకు వచ్చే ప్రయత్నం చేయండి. 

ఇంకా ఏమన్నారు మీరు..? మేం బడ్జెట్ పెట్టలేకపోతున్నామా...! బడ్జెట్ పెట్టలేని పరిస్థితి కల్పించింది మీరే కదా! సీఎఫ్ఎంఎస్ లో ఒక్క క్లిక్ కొడితే ఏ శాఖకు ఎన్ని అప్పులు ఉన్నాయో వచ్చేస్తాయి. ముఖ్యమంత్రి డాష్ బోర్డులో అన్నీ కనిపిస్తాయి! విపక్షంలో ఉన్నప్పుడు మీరు కూడా అన్నీ చూసుకున్నారు కదా. మరి మీరు సీఎఫ్ఎంఎస్ లో సరిగ్గా అప్ లోడ్ చేయకపోవడం వల్లే కదా ఈ సమస్యలన్నీ. 

జగన్ మోహన్ రెడ్డి గారూ... సింగిల్ కెమెరా ప్రెస్ మీట్లు ఏంటండీ! మీకోసం సువిశాలమైన శాసనసభ హాలు ఎదురుచూస్తోంది. మీరేమో అక్కడికి రారు... ఢిల్లీ పోతారు. 

ఢిల్లీ వెళ్లి ఓ గల్లీలో ఫుట్ పాత్ మీద కూర్చుని మీ ఆవేదన అంతా వెళ్లగక్కారు. ఇండియా కూటమి నాయకులతో రాత్రి పూట చర్చించడానికి వెళ్లాను అని నేరుగా చెప్పండి. ఆ మాత్రం దానికి ఈ ముసుగులు ఎందుకు? హత్యలు జరిగితే ఇక్కడున్న డీజీపీకి వివరాలు ఇవ్వకుండా, నేరుగా ఢిల్లీకి వెళ్లడం ఏంటి? 

ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే జాతీయ నాయకులు వస్తారు... ఇక్కడ ఏపీలో ఎలాగూ కేసులు మొదలవుతున్నాయి కాబట్టి, ఢిల్లీలో నాయకులను కలిసి తనను కాపాడేందుకు ఇండియా కూటమి ఏమైనా వస్తుందేమోనని వారితో మాట్లాడినట్టున్నారు. ధైర్యంగా వెళ్లొచ్చు కదా... ముసుగులు ఎందుకు? హత్యకు గురైన వారి జాబితా ఢిల్లీలో అయినా విడుదల చేశారా అంటే అదీ లేదు. 

శాంతిభద్రతలు లేవు అని మీరు చెబుతున్నారు... ఇందాక లోపలికి వస్తుంటే ఎవరో... "శాంతి' కూడా అదే చెబుతోంది సార్... 'శాంతి'కే భద్రతలేదట..." అని చెబుతున్నారు. జగనన్న ఉంటే రైతు భరోసా వచ్చేది, అదొచ్చేది, ఇదొచ్చేది అని జనం అనుకుంటున్నారని మీరు చెబుతున్నారు. ఇంకా భ్రమల్లోనే ఉన్నారా జగన్ మోహన్ రెడ్డి గారూ? ఇకనైన వాస్తవంలోకి రండి" అంటూ పయ్యావుల హితవు పలికారు.

  • Loading...

More Telugu News