Komatireddy Venkat Reddy: కేసీఆర్ స్థానంలో ఉండి ఉంటే రాజకీయాలకు గుడ్‌బై చెప్పేవాళ్లం: మంత్రి కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy fires at KCR

  • ప్రజలు చీల్చి చెండాడితేనే ఒక్క ఎంపీ సీటూ గెలవలేదన్న మంత్రి
  • బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని జోస్యం
  • బీఆర్ఎస్ చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కడుతోందని ఆగ్రహం

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో బడ్జెట్‌ను చీల్చి చెండాడుతామని కేసీఆర్ చెబుతున్నారని, అసలు ఆయనను ప్రజలు చీల్చి చెండాడితేనే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేకపోయారన్నారు. ఏడు స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కలేదన్నారు. ఆయన స్థానంలో తాను సహా ఎవరు ఉన్నా... రాజకీయాలకు గుడ్‌బై చెప్పేవారమన్నారు. ఎనిమిది నెలలుగా ఇంట్లో ఉండి మధ్యలో రెండుసార్లు నడిచినప్పటికీ అసెంబ్లీకి మాత్రం రాలేదన్నారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతున్నట్లుగా తమకు సమాచారం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. విలీనం వంద శాతం ఉంటుందని అభిప్రాయపడ్డారు. లోకల్ బాడీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ ఉంటే ఆ పార్టీ అడ్రస్ లేకుండా చేస్తామన్నారు. బీజేపీది కుర్చీ బచావో ప్రభుత్వమని విమర్శించారు.

నీతి అయోగ్ సమావేశాన్ని దక్షిణాది రాష్ట్రాలు బహిష్కరిస్తున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో పెద్ద మొత్తంలో అప్పులు చేసిందని విమర్శించారు. వారు చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తోందన్నారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రస్తుత బడ్జెట్ అత్యుత్తమమైనదన్నారు.

గాడి తప్పిన రాష్ట్ర బడ్జెట్‌ను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్దపీట వేశామన్నారు. దక్షిణ తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో ప్రాధాన్యత దక్కిందన్నారు.

కేంద్రం సహకరించకపోయినప్పటికీ అత్యుత్తమ బడ్జెట్‌ను ప్రవేశపెట్టామన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. వ్యవసాయానికి బడ్జెట్‌లో రూ.72 వేల కోట్లు కేటాయించామని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైనా ఇలా కేటాయించిందా? అని మంత్రి ప్రశ్నించారు.

Komatireddy Venkat Reddy
KCR
BRS
Congress
  • Loading...

More Telugu News