Narendra Modi: అగ్నిపథ్ స్కీంపై విపక్షాల విమర్శలకు దీటుగా బదులిచ్చిన ప్రధాని మోదీ

PM Modi strongly replies to opposition parties over Agni Path scheme

  • నేడు 25వ కార్గిల్ విజయ్ దివస్
  • ద్రాస్ సెక్టార్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ
  • దేశ రక్షణ అంశాలపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం
  • అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయంటూ వ్యాఖ్యలు

లడఖ్ లోని ద్రాస్ సెక్టార్లో నిర్వహించిన 25వ కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలపై ధ్వజమెత్తారు. అగ్నిపథ్ స్కీంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు దీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశారు. దేశ రక్షణ, భద్రత వ్యవస్థకు సంబంధించిన సున్నితమైన అంశంపై విపక్ష నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

"మన భద్రత బలగాలకు అవసరమైన సంస్కరణలకు అగ్నిపథ్ స్కీం ఒక ఉదాహరణ. మన భద్రతా బలగాల్లో ఎప్పుడూ యువ రక్తం నిండి ఉండాలని, ఏ సమయంలో అయినా యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉండాలని అనేక దశాబ్దాలుగా చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. 

ప్రపంచ దేశాల సైనికుల సగటు వయసు కంటే భారత సైనికుడి సగటు వయసు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. దీనిపై అనేక కమిటీలు చర్చించాయే కానీ, ఏ ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోలేదు. అగ్నిపథ్ స్కీం ద్వారా మేం ఈ సమస్యకు పరిష్కారం తీసుకువచ్చాం. ఈ పథకం ద్వారా భారత సైన్యంలో యువరక్తం పొంగిపొర్లుతుంది... అన్నివేళలా యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది. 

కానీ, దురదృష్టవశాత్తు కొందరు వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి దీనిపై రాద్ధాంతం చేస్తున్నారు. ఇలా విమర్శలు చేసేవాళ్లందరూ కూడా రక్షణ రంగ వ్యవస్థల్లో జరిగిన కుంభకోణాల్లో ఉన్నవారే. ఈ కుంభకోణాలే మన భద్రతా బలగాలను బలహీనంగా మార్చేశాయి. 

భారత వాయుసేన అధునాతన ఫైటర్ జెట్లను సమకూర్చుకోవాలని ఎన్నడూ కోరుకోని వ్యక్తులు కూడా వీళ్లే. దేశీయ యుద్ధ విమానం తేజాస్ ప్రాజెక్టును మూలన పడేయాలని భావించింది కూడా వీళ్లే. 

డబ్బును ఆదా చేయడానికే ప్రభుత్వం ఈ అగ్నిపథ్ స్కీం తీసుకువచ్చిందని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. వీళ్లని నేను ఒక్కటే అడుగుతున్నా... సైనికుల పెన్షన్ అంశం 30 ఏళ్ల తర్వాత తెరపైకి వచ్చింది. మేమే ఈ అంశాన్ని ఎందుకు తలకెత్తుకున్నాం? తర్వాత వచ్చే ప్రభుత్వాలు చూసుకుంటాయిలే అని వదిలేయొచ్చు కదా! కానీ మేం అలా చేయలేదు... ఎందుకంటే రక్షణ దళాలు అంటే మాకు గౌరవం ఉంది, వారి నిర్ణయం పట్ల మాకు గౌరవం ఉంది. దీన్ని మేం రాజకీయంగా భావించలేదు కాబట్టి చిత్తశుద్ధితో ఈ అంశాన్ని పరిశీలనకు తీసుకున్నాం. మా వరకు దేశ భద్రతకే ప్రథమ ప్రాధాన్యత" అని మోదీ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News