Vijayasai Reddy: విజయసాయి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్

Rajya Sabha deputy chairman fires on Vijayasai Reddy

  • నిన్న రాజ్యసభలో ఆసక్తికర పరిణామం
  • ఏపీలో హింస రాజ్యమేలుతోందన్న విజయసాయి
  • అప్పటి సీఎం పోలవరం ద్వారా సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించారని ఆరోపణ
  • ఆరోపణలు చేసి వదిలేయడం కాదు... సాయంత్రంలోగా ఆధారాలు ఇవ్వాలన్న హరివంశ్

నిన్న రాజ్యసభలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏపీలో ఎన్నికల అనంతరం తీవ్ర స్థాయిలో హింస చోటుచేసుకుంటోందని, రాజకీయ హత్యలు, దాడులు జరుగుతున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభకు తెలిపారు. 

ఆ తర్వాత పోలవరం విషయంలో చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. అప్పట్లో పోలవరం ప్రాజెక్టును తమకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని, దాంతో కేంద్రం ఆ ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించిందని తెలిపారు. ఆ ప్రాజెక్టు నుంచి నాటి సీఎం (చంద్రబాబు) కొంత సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించారని వివరించారు. 

అయితే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ దీనిపై కొంచెం కటువుగా స్పందించారు. ఆరోపణలు చేసి వదిలేయడం కాదు... ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ఆధారాలపై స్పష్టమైన సమాధానం చెప్పడంలో విజయసాయి దాటవేత వైఖరి ప్రదర్శించే ప్రయత్నం చేశారు. దాంతో, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తీవ్ర స్వరంతో మాట్లాడుతూ, ఏపీలో జరుగుతున్న ఘటనలపై సాయంత్రంలోగా ఆధారాలు ఇవ్వండి... కచ్చితంగా ఇవ్వాలి... మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను... మీరు చాలా సీనియర్ రాజ్యసభ సభ్యులు... మీరు చేసినవి చాలా తీవ్రమైన ఆరోపణలు... ఆధారాలు ఇస్తే సరి... లేదంటే వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది అని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News