IPL 2025: బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానుల మధ్య జులై 31న భేటీ... ఐపీఎల్ 2025కి సన్నాహాలు మొదలు!

BCCI and IPL owners set to meet on July 31

  • ఆటగాళ్ల రిటెయిన్ రూల్స్‌పై చర్చించే అవకాశం
  • ఐదుగురి కంటే ఎక్కువ మందిని రిటెయిన్ చేసుకునేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్న ఫ్రాంచైజీలు
  • వేలానికి పెద్దగా ప్రాధాన్యత ఉండదని భావిస్తున్న బీసీసీఐ
  • 31న జరిగే భేటీలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ 

బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానుల మధ్య జులై 31న కీలక భేటీ జరగనుంది. ప్రతి మూడేళ్లకు ఒకసారి ఆటగాళ్ల మెగా వేలం పట్ల యాజమాన్యాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. ఆటగాళ్ల రిటెన్షన్ (నిలుపుదల చేసుకునే ఆటగాళ్లు) నిబంధనలపై చర్చించే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం గరిష్ఠంగా ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే రిటెయిన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మరింత ఎక్కువ మంది ప్లేయర్లను రిటెయిన్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించాలని పలు ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. దీంతో ఐపీఎల్ 2025 సన్నాహాలు, ప్రణాళికల్లో భాగంగా తొలుత రిటెన్షన్ నిబంధనలపై భేటీలో చర్చించనున్నారని క్రికెట్ అప్‌డేట్స్ అందించే ‘క్రిక్‌బజ్’ ఓ కథనం వెలువరించింది.

రిటెన్షన్‌ విషయంలో జట్ల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, ఐదు కంటే ఎక్కువ మందిని రిటెయిన్ చేసుకునే అవకాశం ఇవ్వాలని ఫ్రాంచైజీలు కోరుతున్నాయని ఆ కథనం పేర్కొంది. ఎనిమిది మంది ఆటగాళ్లను రిటెయిన్ చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని జట్లు కోరుతున్నాయని, అయితే ఇదే జరిగితే ఆటగాళ్ల వేలానికి పెద్దగా ప్రాధాన్యత దక్కకపోవచ్చని బీసీసీఐ భావిస్తోందని తెలిపింది. కాబట్టి ఆటగాళ్ల రిటెయిన్‌ సంఖ్యపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నప్పటికీ పాత నిబంధన ప్రకారం ఐదుగురికే కట్టుబడి ఉండే అవకాశం ఉందని క్రిక్‌బజ్ కథనం విశ్లేషించింది. 

ఇదిలావుంచితే.. వివాదాస్పద అంశంగా ఉన్న రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) కార్డుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నిబంధన కింద తమ జట్టులోని ఆటగాడిని వేలానికి ఉంచి అతడికి పలికిన ధర చెల్లించి తిరిగి ఆ ఆటగాడిని దక్కించుకునే అవకాశం ఈ నిబంధన కల్పిస్తుంది. ఐపీఎల్ -2018లో ఆర్టీఎం కార్డ్‌ నిబంధనను ప్రవేశపెట్టారు. ఆటగాళ్లకు మంచి జరుగుతుందని భావిస్తున్న ఈ నిబంధనను 2021 మెగా వేలంలో అమలు చేయలేదు. ఆర్‌టీఎం కార్డు నిబంధన ప్రకారం... ఒక ఆటగాడి రేటుని పెంచడానికి మాత్రమే ఇతర ఫ్రాంచైజీలు ఉపయోగపడతాయి. కానీ వారిని దక్కించుకునేందుకు అవకాశం ఉండదు. అయితే ఈ నిబంధన విషయంలో జట్లను బీసీసీఐ ఏకతాటిపైకి తీసుకురావడం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • Loading...

More Telugu News