Madanapalle: మదనపల్లెలో ఏవో పది అర్జీలు వస్తాయనుకుంటే వందల సంఖ్యలో అర్జీలు రావడం ఆశ్చర్యం కలిగించింది: ఆర్పీ సిసోడియా
- మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతుల స్వీకరణ
- భూ అక్రమాలపై భారీగా ఫిర్యాదులు వచ్చాయన్న సిసోడియా
- అర్జీలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వెల్లడి
మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో నేడు ప్రజల నుంచి అర్జీల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా హాజరయ్యారు. ప్రజల నుంచి ఆయన స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు.
కాగా, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల నుంచి అత్యధిక శాతం ప్రజలు ఫిర్యాదు చేశారు. దీనిపై సిసోడియా స్పందించారు. భూ అక్రమాలపై అర్జీలు స్వీకరిస్తాం అంటే ఓ పది మంది వస్తారనుకున్నానని, కానీ వందల మంది ఫిర్యాదు చేసేందుకు రావడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ఈ అర్జీలన్నింటిపైనా సమగ్ర విచారణ జరిపి భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని వివరించారు.
భారీగా అర్జీలు వచ్చాయంటే వ్యవస్థలో లోపాలు ఉన్నట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. రెవెన్యూ వ్యవస్థలో లోపాలను సరిచేస్తామని సిసోడియా స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన అర్జీలపై నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదని ఉద్ఘాటించారు. అర్జీలపై ప్రతివారం సబ్ కలెక్టరేట్ నుంచి నివేదిక తీసుకుంటామని అన్నారు.
మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఫైళ్లు దగ్ధమైన ఘటనపైనా సిసోడియా స్పందించారు. దహనమైన ఫైళ్లను రీక్రియేట్ చేస్తామని వెల్లడించారు. అయితే పర్మినెంట్ ఫైలు దగ్ధం కానందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఫైళ్ల దగ్ధం ఘటనపై ఫోరెన్సిక్ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని వివరించారు.