Gautam Gambhir: తెలుగు కుర్రాడిని శ్రీలంక టూర్‌కి ఎంపిక చేయాలని భావించిన కోచ్ గౌతమ్ గంభీర్!

coach Gautam Gambhir wanted Tilak Varma for the T20I and ODI series against Sri Lanka

  • తిలక్ వర్మను శ్రీలంక పర్యటనకు సెలక్ట్ చేయాలని భావన
  • కానీ.. గాయం కారణంగా సిరీస్‌కు దూరం
  • తిలక్ వర్మ లేకపోవడంతో రియాన్ పరాగ్‌కు వన్డే, టీ20 జట్లలో దక్కిన చోటు!

హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో భారత క్రికెట్ జట్టు శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌ ఆడేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఆతిథ్య దేశం శ్రీలంక చేరుకున్న భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. కాగా ఈ పర్యటనకు తెలుగు కుర్రాడు తిలక్ వర్మను జట్టులోకి తీసుకోవాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడని, అయితే చేతి గాయం కారణంగా యువ క్రికెటర్ అందుబాటులో లేడని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తన కథనంలో పేర్కొంది. 

ఐపీఎల్ సమయంలోనే తిలక్ వర్మ గాయపడ్డాడని, ప్రస్తుతం అతడు ఆటకు దూరమయ్యాడని తెలిపింది. తిలక్ వర్మ అందుబాటులో లేకపోవడంతో మరో యువ క్రికెటర్ రియాన్ పరాగ్‌కు జట్టులో చోటు దక్కిందని పేర్కొంది. శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేసిన రెండు పరిమితి ఓవర్ల సిరీస్‌లలోనూ రియాన్ పరాగ్‌కు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా చోటు దక్కడానికి తిలక్ వర్మ గైర్హాజరు సాయపడిందని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం వివరించింది.

అయితే, రియాన్ పరాగ్ ప్రతిభకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారని జట్టు ఎంపికపై అవగాహన ఉన్న వర్గాలు చెబుతున్నాయి. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్, ఫీల్డింగ్ నైపుణ్యాలను చూసి శ్రీలంక టూర్‌కు ఎంపిక చేశారని పేర్కొంటున్నాయి. ‘‘ రియాన్ పరాగ్ అత్యంత ప్రతిభావంతుడు. ఆటను చాలా మెరుగుపరుచుకున్నాడు. నిలకడగా రాణించాలని చూస్తున్నాడు. జట్టు విలువను పెంచుకునేలా అతడు బౌలింగ్ చేయగలడు. ఇక అద్భుతమైన ఫీల్డర్. అందుకే సెలెక్టర్లు కూడా ప్రోత్సహించాలనుకుంటున్నారు. అతనిని భవిష్యత్ ఆటగాడిగా పరిగణిస్తున్నారు’’ అని సంబంధిత వర్గాలు చెప్పినట్టు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం పేర్కొంది. 

రియాన్ పరాగ్ బౌలింగ్‌లో చక్కటి వైవిధ్యాన్ని చూపించగలడని, యార్కర్లు, స్లో బంతులు వేయగలడని, పరిమిత ఓవర్ల క్రికెట్ జట్టులోకి అతడిని తీసుకునేందుకు ఇవే కారణాలంటూ చెప్పినట్టు వివరించింది.

శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్‌కు మొదటి పర్యటన కానుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో జట్టు టీ20 సిరీస్ ఆడబోతోంది. మిగతా టీ20 జట్టులోని ఆటగాళ్ల విషయానికి వస్తే శుభ్‌మాన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్ జట్టు సభ్యులుగా ఉన్నారు.

  • Loading...

More Telugu News