Pawan Kalyan: ఈ-వ్యర్థాల తొలగింపుపై ప్రశ్నించిన ఎమ్మెల్సీలు... సమాధానమిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- నేడు శాసనమండలికి హాజరైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- దేశంలో ఈ-వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఏపీ టాప్-3లో లేదన్న పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యావరణ శాఖను కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన శాసనమండలికి హాజరయ్యారు. ఈ-వ్యర్థాల తొలగింపునకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్సీలు ప్రశ్నించగా, పవన్ కల్యాణ్ సమాధానమిచ్చారు.
దేశంలో ఈ-వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఏపీ టాప్-3లో లేదని, ఈ జాబితాలో మన రాష్ట్రానిది 12వ స్థానం అని వెల్లడించారు. రాష్ట్రంలో పలు చోట్ల రీసైక్లింగ్ యూనిట్లు ఉన్నాయని తెలిపారు.
త్వరలోనే ప్రతి జిల్లాలోనూ ఈ-వ్యర్థాల రీసైక్లింగ్ యూనిట్లు స్థాపిస్తామని, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ యూనిట్లు నెలకొల్పుతామని చెప్పారు. ఈ-వ్యర్థాలను సేకరించి సమర్థవంతంగా తొలగించేందుకు తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.