Kargil Vijay Diwas: కార్గిల్ విజయ్ దివస్.. నాలుగు రోజుల్లో 160 కిలోమీటర్లు పరుగెత్తిన ఆర్మీ రిటైర్డ్ మహిళా అధికారి.. వీడియో ఇదిగో!
- రోజుకు సగటున 40 కిలోమీటర్ల చొప్పున పరిగెత్తిన బర్షారాయ్
- శ్రీనగర్‌లో ఈ నెల 19న ప్రారంభమైన పరుగు
- 22న కార్గిల్ వార్ మెమోరియల్‌కు చేరుకోవడంతో ముగిసిన వైనం
- అక్కడ అమర వీరులకు నివాళి
కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా లెఫ్టినెంట్ కల్నల్ బర్షారాయ్ (రిటైర్డ్) నాలుగు రోజుల్లో 160 కిలోమీటర్ల పరుగును పూర్తిచేశారు. శ్రీనగర్ నుంచి ద్రాస్ వరకు పరుగును విజయవంతంగా పూర్తిచేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మన సైనికుల త్యాగాలకు నివాళిగా తాను ఈ పరుగును పూర్తిచేసినట్టు ఆమె తెలిపారు.
ఈ నెల 19న శ్రీనగర్‌లో పరుగును ప్రారంభించిన ఆమె 22న ద్రాస్ సెక్టార్‌లోని కార్గిల్ వార్ మెమోరియల్‌కు చేరుకోవడంతో ముగిసింది. ఆమెతోపాటు చినార్ వారియర్స్ మారథాన్ జట్టు కూడా పరుగు తీసింది. పరుగు పూర్తయిన అనంతరం కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు.
రాయ్ రోజుకు సగటున 40 కిలోమీటర్లు పరిగెత్తారు. తొలి రోజు శ్రీనగర్‌లో ప్రారంభమైన పరుగు రెండో రోజున వుసాన్ నుంచి మొదలుపెట్టి సముద్ర మట్టానికి 9 వేల అడుగుల ఎత్తున ఉన్న సోనామార్గ్ చేరుకున్నారు. మూడో రోజు శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఉన్న 11,649 అడుగుల ఎత్తయిన జోజిలాపాస్‌ను అధిగమించారు. ఇది కశ్మీర్ లోయను లడఖ్ ప్రాంతంతో కలుపుతుంది. నాలుగో రోజు మటాయెన్ నుంచి ద్రాస్‌లోని కార్గిల్ మెమోరియల్‌కు చేరుకున్నారు. కాగా, బర్షారాయ్ భర్త కూడా కశ్మీర్‌లో ఆర్మీ అధికారిగా పనిచేస్తున్నారు.