Sajjala Ramakrishna Reddy: ఇండియా కూటమిలోకి వైసీపీ...?... సజ్జల ఏమన్నారంటే...!

Sajjala clarifies on speculation that YCP moving closure to India Bloc

  • ఏపీలో హింస చోటుచేసుకుంటోందంటూ ఢిల్లీలో వైసీపీ ధర్నా
  • మద్దతు పలికిన పలు పార్టీలు
  • ఇండియా కూటమిలోని పార్టీలన్నీ జగన్ కు మద్దతిస్తాయన్న ప్రియాంక చతుర్వేది
  • ఓట్ల కోసం ఇతర పార్టీలతో కలవబోమన్న సజ్జల
  • ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతర పార్టీల మద్దతు తీసుకుంటామని వెల్లడి

ఇవాళ ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నాకు కాంగ్రెస్ తప్ప ఇండియా కూటమిలోని పలు పార్టీలు మద్దతు పలికాయి. ఏపీలో జరుగుతున్న హింసను ఖండిస్తున్నామని, ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు జగన్ వెంట నిలుస్తాయని శివసేన (ఉద్ధవ్ థాకరే గ్రూప్) ఎంపీ ప్రియాంక చతుర్వేది ప్రకటించారు. దాంతో, వైసీపీ ఇండియా కూటమిలో చేరనుందా? అనే ప్రచారం మొదలైంది. దీనిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. 

వైసీపీ ఒక బలమైన పార్టీ అని, కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే అన్నట్టుగా పొత్తు పెట్టుకోకూడదన్నది జగన్ సిద్ధాంతం అని వెల్లడించారు. గత పన్నెండేళ్లుగా ఆ సిద్ధాంతం ప్రకారమే పార్టీని నడిపిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు కూడా అదే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నామని సజ్జల చెప్పారు. 

"ఇవాళ్టి అంశం అన్ని పార్టీలకు సంబంధించినది. మా ఒక్క పార్టీకే సంబంధించింది కాదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రూపంలో ఉండొచ్చు. ఇతర పార్టీకి ఇబ్బంది వచ్చినప్పుడు మా పార్టీ కూడా వాళ్లకు సపోర్ట్ చేస్తుంది. రాజకీయ హింసను తప్పకుండా ఖండిస్తాం. ఈ అంశం ప్రాతిపదిక మీదనే ఢిల్లీలో ధర్నాకు అందరినీ ఆహ్వానించాం. వాళ్లు కూడా ఆ కోణంలోనూ చూసి మాకు మద్దతు ఇచ్చేందుకు వచ్చారని అనుకుంటున్నాం. ఇలాంటి సంక్షోభాలు ఎప్పుడు వచ్చినా అందరం కలుస్తాం. 

ఇవాళ్టి ధర్నాకు రావాలని మేం బీజేపీ, కాంగ్రెస్ లను కూడా కలిశాం. ఖర్గే, నడ్డాలను కలిసి ఆహ్వానించడం జరిగింది. రాగలిగిన పార్టీలు వచ్చాయి. రాజకీయ దృష్టితో చూసినవాళ్లు రాలేదు. వాళ్ల పరిమితులు ఏమున్నాయో మాకు తెలియదు. ఈ అంశాన్ని చూసి, దీన్ని ఖండించాలి అనుకునేవారు వచ్చారు... అందుకు మాకు సంతోషం. భవిష్యత్తులో ఇలాంటివి సంభవించినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే వీటిని ఆపొచ్చు. 

ఎన్నికల అనంతరం ఈ విధంగా హింస చోటుచేసుకోవడం చరిత్రలో ఇంతకుముందెప్పుడూ జరగలేదు. కౌంటింగ్ తర్వాత టీడీపీ ప్రణాళిక ప్రకారం దాడులు చేసింది. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయింది. మా పార్టీ కార్యకర్తలపై, మా పార్టీ సానుభూతి పరులపై రాజకీయ దాడులు జరిగాయి. మాకు ఓటేసిన సామాన్య ప్రజలపై కూడా దాడులు చేసే పరిస్థితి వచ్చింది. 

దాడులు తీవ్రరూపం దాల్చడంతో గవర్నర్ ను ఒకట్రెండు సార్లు కలిశాం. ఇది మంచి సంస్కృతి కాదని టీడీపీ వాళ్లకు కూడా విజ్ఞప్తి చేశాం. ఇటువంటి వాటికి బీజం వేస్తే, భవిష్యత్తులోనూ కొనసాగుతాయని ఆందోళన వ్యక్తం చేశాం. కానీ వాళ్లు (టీడీపీ) వినలేదు. ఒకసారి జాతీయ స్థాయిలో అందరికీ వివరించాలనే ఢిల్లీలో నిరసన చేపట్టాం. 

పార్టీలు మనుగడ సాగించాలి, కార్యకర్తలు స్వేచ్ఛగా మాట్లాడగలగాలి... అందులోనూ మాకు 40 శాతం ఓట్లు వచ్చాయి. 2019లో మాకు 151 సీట్లు వచ్చినప్పుడు కూడా మేం ఈ విధంగా వ్యవహరించలేదు. చంద్రబాబు కుమారుడు రెడ్ బుక్ అనేది తీసుకురావడం, మీపై 12 కేసులకు తక్కువ ఉంటే నన్ను కలవొద్దు అని వాళ్ల కార్యకర్తలకు చెప్పడం... ఇలాంటివన్నీ కూడా ఇటీవలి ఘటనలకు ప్రేరణగా నిలిచాయని చెప్పొచ్చు. 

అందుకే ఈ హింసను ఇతర పార్టీల దృష్టికి తీసుకెళ్లాలి, జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లాలి, జాతీయ స్థాయికి తీసుకెళ్లగలిగితే కనీసం కంట్రోల్ అవుతుంది అనే ఉద్దేశంతో నిరసన నిర్వహించాం. రాష్ట్రపతి పాలన పెట్టాల్సినంత అరాచక పరిస్థితి ఏపీలో ఉంది అని చెప్పడానికి కూడా ఇక్కడికి వచ్చాం. 

మా నిరసనకు మంచి స్పందన వచ్చింది. దాదాపు ఆరేడు పార్టీల వరకు మాకు మద్దతు పలికాయి. సమాజ్ వాదీ, శివసేన, అన్నాడీఎంకే, తృణమూల్ వంటి పార్టీలు వచ్చాయి. మీడియా కూడా దృష్టి సారించింది. మేం ఏదైతే ఆశించామో అది పూర్తిస్థాయిలో విజయవంతమైంది. 

దీన్నుంచి మేం ఆశించేది ఒక్కటే... రాష్ట్రంలో హింసకు అడ్డుకట్ట పడి, ప్రశాంత వాతావరణం నెలకొనాలి. ఇదొక చెడు సంప్రదాయం... రేపు మేం అధికారంలోకి వచ్చినా ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది.. అప్పుడుం మేం వీటిని ఆపలేకపోవచ్చు. అందుకే ఈ హింసను ఇప్పుడే కట్టడి చేయడం అనేది అందరి బాధ్యత" అని సజ్జల స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News