Zomato delivery Boy: ముంబై స్లమ్ ఏరియాలో రూ.500 అద్దె రూమ్.. జొమాటో డెలివరీ బాయ్ వీడియో వైరల్
- మరో వ్యక్తితో కలిసి ఇరుకైన రూమ్ షేర్ చేసుకుంటున్న ప్రంజయ్ అనే యువకుడు
- కష్టాల్లో ఉన్నా సానుకూల దృక్పథం ప్రదర్శన
- సింగర్‌గా, ఫుల్బాల్ ప్లేయర్‌గా రాణించాలని భావిస్తున్నట్టు వెల్లడి
ముంబై మహానగరంలోని స్లమ్ ఏరియాలో నివసించేవారి జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో తెలియజేసే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రంజయ్ బోర్గోయరీ అనే జొమాటో డెలివరీ బాయ్ నెలకు కేవలం రూ.500 అద్దె చెల్లిస్తూ ఇరుకైన రూమ్‌లో నివాసం ఉంటున్నాడు. మరో స్నేహితుడితో కలిసి ఈ రూమ్‌ను షేర్ చేసుకుంటున్నాడు. వీరిద్దరికి తోడు ఒక పిల్లి కూడా ఆ అద్దె గదిలో ఉంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రంజయ్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశాడు. వైరల్‌గా మారిన ఈ వీడియోలో ప్రంజయ్ తన వ్యథలను పంచుకున్నాడు.
ఈశాన్య భారతదేశం నుంచి ముంబైకి వలస వచ్చానని, నెలకు కేవలం రూ.500 చెల్లించి మరొక వ్యక్తితో కలిసి ఇరుకైన గదిలో నివసిస్తున్నట్టు చెప్పాడు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, తన కోసం ఇంట్లో వాళ్లు కూడా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ అతడు సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించాడు. ఇక సింగర్‌గా, ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రాణించాలని భావిస్తున్నానని చెప్పాడు. తన మ్యూజిక్‌కు సంబంధించిన వీడియోలను ఆన్‌లైన్‌లో అతడు షేర్ చేశాడు.
కాగా ప్రంజయ్ షేర్ చేసిన వీడియోకు 4.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు చాలా మంది నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. ఖుషీ అనే ఓ వ్యక్తి మూడు నెలల అద్దె డబ్బులు సాయంగా అందించాడు. జీవితం మెరుగుపడుతుందని, మెరుగైన జీవితాన్ని త్వరగా పొందాలంటూ పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
కొరియన్ పాప్ స్టార్లతో పోల్చిన మరికొందరు మోడలింగ్ రంగంలో ప్రయత్నించాలంటూ సూచనలు చేశారు. ప్రంజయ్ కథను చూసి కష్టాల్లో ఉన్నవారు కూడా ప్రేరణ పొందవచ్చునని, క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రోత్సాహం పొందవచ్చునని వ్యాఖ్యానించారు.
కాగా ఈ వీడియో ముంబైలోని స్లమ్ ఏరియాలో జీవించేవారి దుర్భర పరిస్థితికి అద్దం పడుతోందని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు.