Revanth Reddy: ఢిల్లీలో దీక్షకు కూర్చుంటాను.. కేసీఆర్‌నూ రమ్మనండి, ఇద్దరం చచ్చుడో నిధులు తెచ్చుడో చూద్దాం: రేవంత్ రెడ్డి

Revanth Reddy ready to deeksha in Delhi

  • రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఢిల్లీలో దీక్ష చేయాలని కేటీఆర్ సూచన
  • తాము ఎవరి శవాలపై రాజకీయాలు చేయలేదన్న ముఖ్యమంత్రి
  • కేసీఆర్ ఎందుకు... రేవంత్ రెడ్డి దీక్ష చేస్తే మేం రక్షణగా ఉంటామన్న హరీశ్ రావు

ఢిల్లీలో దీక్షకు కూర్చునేందుకు నేను సిద్ధం... కేసీఆర్‌నూ రమ్మనండి... అప్పుడు నిధులు తెచ్చుడో... మేమిద్దరం చచ్చుడో చూద్దామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఢిల్లీలో పోరాడుదామని పిలుపునిచ్చారు. అందరం వెళ్లి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేద్దామని సూచించారు. తెలంగాణ నుంచి ఉన్న కేంద్రమంత్రులు కూడా నిధులు తెస్తారో... రాజీనామా చేస్తారో తేల్చుకోవాలన్నారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చామని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు. రూ.100 పెట్టి కిరోసిన్ కొని.. 10 పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనలేకపోయిన వారు ఉన్నారని విమర్శించారు. తాము ఎవరి శవాలపైనా రాజకీయాలు చేయలేదన్నారు.

దీక్ష గురించి కేటీఆర్ ప్రతిపాదించారని, దీక్షకు నేను సిద్ధం... కేసీఆర్‌ను రమ్మనండి అన్నారు. సభా పక్ష నాయకుడిగా నేను, ప్రతిపక్ష నేతగా కేసీఆర్... ఇద్దరం జంతర్ మంతర్ వద్ద దీక్షకు కూర్చుంటామన్నారు. అప్పుడు నిధులు తెచ్చుడో... మేమిద్దరం చచ్చుడో తేలిపోతుందన్నారు. తాను దీక్షలో కూర్చోవడానికి సిద్ధమన్నారు.

కేసీఆర్ ఎందుకు... మేం రేవంత్ రెడ్డికి రక్షణగా ఉంటాం: హరీశ్ రావు

బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై తాము అఖిలపక్షానికి, ధర్నాకు, దేనికైనా సిద్ధమని హరీశ్ రావు అన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం కోసం తాము సిద్ధమన్నారు. కానీ రుణమాఫీ గురించి తనను, నిరుద్యోగుల గురించి కేటీఆర్‌ను, ఇప్పుడు కేసీఆర్‌ను దీక్ష చేయమని రేవంత్ రెడ్డి సూచిస్తున్నారని, అన్నీ మేమే చేస్తే ఇక మీరేం చేస్తారని మాజీ మంత్రి ప్రశ్నించారు. 

తమది ఉద్యమస్ఫూర్తి అని, కానీ రాజీనామా చేయకుండా పారిపోయింది మీరే అని విమర్శించారు. తెలంగాణవాదుల పైకి తుపాకీ గురిపెట్టి రైఫిల్ రెడ్డిగా పేరు పొందారని ఎద్దేవా చేశారు. పదవులను తృణపాయంగా వదిలేశామన్నారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ త్యాగాలు చేసిందన్నారు. కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చాడన్నారు.

నాడు సోనియాను దెయ్యం, రాహుల్ గాంధీని పప్పు అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు వారిని పొగుడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఏకగ్రీవ తీర్మానానికి తాము ఆమోదం తెలుపుతామన్నారు. అయితే దీక్షకు కేసీఆర్ ఎందుకు? నువ్వు దీక్ష చెయ్... మేం నీ చుట్టూ ఉంటామని హరీశ్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి దీక్ష చేస్తామంటే తాము రక్షణగా ఉంటామన్నారు. రేవంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఎమ్మెల్యేలం అందరం ఆయన వెంట ఉంటామని కేటీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News