: జవాను పొట్టలో ల్యాండ్ మైన్ పెట్టిన మావోయిస్టు దొరికాడు
నక్సల్ హింస వికృత రూపం దాల్చుతోందనడానికి ఈ పాశవిక చర్యే తార్కాణం. పేలుడు ధాటికి చనిపోయిన సీఆర్పీఎఫ్ జవాను పొట్టలో మందుపాతర అమర్చి మరికొందరిని బలితీసుకునేందుకు మావోయిస్టులు యత్నించడం ఒళ్ళుగగుర్పొడుస్తోంది. ఈ ఏడాది జనవరిలో జార్ఖండ్ లోని లతేహార్ ప్రాంతంలో పోలీసు దళాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని నక్సల్స్ మందుపాతరల సాయంతో పేల్చివేశారు. ఆ ఘటనలో పలువురు జవాన్లు మరణించారు.
అయితే, సంఘటన స్థలంలో మరోసారి విధ్వంసం సృష్టించేందుకు వ్యూహ రచన చేసిన మావోయిస్టులు.. మృత జవాను ఉదరంలో పేలుడు పదార్థాలు కూరారు. సహచరుల దేహాలను తీసుకెళ్ళేందుకు మరికొంతమంది జవాన్లు, వారితోపాటు అధికారులు వస్తారని, ఆ సమయంలో పొట్టలో మందుపాతర పేల్చితే వారినీ హతమార్చాలన్నది నక్సల్స్ ఆలోచన. కానీ, ఈ పన్నాగాన్ని భద్రత బలగాలు భగ్నం చేశాయి.
అనంతరం, జరిగిన గాలింపు చర్యల్లో బీహార్-జార్ఖండ్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు అనూప్ ఠాకూర్ పోలీసుల చేత చిక్కాడు. అప్పట్లో జవాను పొట్టలో మందుపాతర అమర్చినట్టు వచ్చిన వార్తలను నక్సల్స్ ఖండించగా.. ఠాకూర్ మాత్రం తాము ఆ దుశ్చర్యకు పాల్పడ్డట్టు అంగీకరించాడు. అంతేగాకుండా, తానే స్వయంగా ఓ జవాను పొట్ట కోసి ల్యాండ్ మైన్ పెట్టానని వెల్లడించాడు.